NEET PG 2022 - నీట్‌ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ

మే 21న నిర్వహించనున్న నీట్‌ పీజీ-2022 పరీక్షను వాయిదా వేసేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

Published : 13 May 2022 14:13 IST

మే 21న నీట్‌ పీజీ పరీక్ష

దిల్లీ: మే 21న నిర్వహించనున్న నీట్‌ పీజీ-2022 పరీక్షను వాయిదా వేసేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నీట్‌ పరీక్షను వాయిదా వేయడం వల్ల డాక్టర్ల కొరత ఏర్పడడంతోపాటు రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మే 21న నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైంది.

ఈఏడాది నీట్‌ పీజీ-2022 పరీక్ష నిర్వహించేందుకుగాను ఫిబ్రవరి 4న నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మే 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరే ఆశావాహులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గతేడాది పరీక్ష రాసిన అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. ఇటువంటి సమయంలో మే 21న నిర్వహించ తలపెట్టిన ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని విన్నవించారు. వాదనలు విన్న జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ సమయంలో పరీక్ష వాయిదా వేయడంతో గందరగోళ పరిస్థితులతో పాటు తీవ్ర అనిశ్చితి ఏర్పడుతుందని అభిప్రాయపడింది. అంతేకాకుండా పరీక్ష కోసం వేచిచూస్తోన్న వేల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంటూ పరీక్ష వాయిదా వేసేందుకు నిరాకరించింది.

మరోవైపు నీట్‌ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాసింది. గతేడాది పరీక్ష నిర్వహణ, ప్రవేశాల ప్రక్రియ చాలా ఆలస్యంగా జరిగిందని, మిగిలిపోయిన సీట్లకు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కౌన్సిలింగ్‌ నిర్వహించాల్సి ఉందని లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో గతేడాది కౌన్సిలింగ్‌లో సీటు దక్కని విద్యార్థులు ఈ సారి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. కొవిడ్‌ సమయంలో సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో వైద్య విద్యార్థులు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేయడంలోనూ జాప్యం జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని