SC: గంభీర్.. మీపై విచారణను ఆపలేం

అనధికారికంగా కొవిడ్ ఔషధాలను నిల్వ ఉంచిన కేసులో భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌పై విచారణను ఆపలేమని సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Published : 26 Jul 2021 23:46 IST

దిల్లీ: అనధికారికంగా కొవిడ్ ఔషధాలను నిల్వ ఉంచిన కేసులో భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌పై విచారణను ఆపలేమని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఊరట కోసం దిల్లీ హైకోర్టును సంప్రదించవచ్చని తెలిపింది. ‘ఆ కేసులో మేం విచారణను ఆపలేము. కోర్టు ముందు మీ వాదనలు వినిపించండి. ప్రజలంతా ఆందోళనలో ఉన్న సమయంలో.. ట్రస్టులు, వ్యక్తులు ఔషధాలను పంచడానికి మేం అనుమతించం. అప్పుడు ప్రతి ఒక్కరూ తమ స్వలాభం కోసం ఔషధాలు సేకరించి, పంపిణీ చేస్తారు’ అంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. 

దిల్లీలో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో గౌతమ్ గంభీర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫాబి ఫ్లూ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ఇది రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలో ఔషధాల కొరత ఉన్న సమయంలో గంభీర్ అంతమొత్తంలో ఫాబిఫ్లూను ఎలా కొనుగోలు చేశారని, ఎలా పంచుతున్నారని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి. ఈ వ్యవహారం కాస్తా దిల్లీ హైకోర్టుకు చేరింది. దీనిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. గంభీర్ ఉద్దేశం మంచిదే అయినా దానివల్ల సమాజానికి నష్టం కలుగుతోందని వ్యాఖ్యానించింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఔషధ నియంత్రణ అధికారి విచారణ జరిపి, నివేదిక సమర్పించారు. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ కొవిడ్ ఔషధాలను అనధికారికంగా నిల్వ చేసినట్లు తేలిందని తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు.. దీనిపై తదుపరి విచారణను జులై 29కి వాయిదా వేసింది. కాగా, దీనిపై గంభీర్ సుప్రీంను ఆశ్రయించగా.. విచారణను ఆపలేమని తేల్చిచెప్పింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని