Supreme Court: రూ.2వేల నోట్ల మార్పిడిపై పిటిషన్‌.. అత్యవసర విచారణకు సుప్రీం ‘నో’!

ఎటువంటి దరఖాస్తు, ఐడీ లేకుండా రూ.2వేల కరెన్సీ నోట్ల మార్పిడి చేస్తామని పేర్కొనడంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

Updated : 01 Jun 2023 17:07 IST

దిల్లీ: రూ.2వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ (2000 note withdrawal).. వీటిని మార్పిడి చేసుకునేందుకు సెప్టెంబర్‌ చివరి వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోట్లను ఎటువంటి ఐడీ ప్రూఫ్‌, దరఖాస్తు లేకుండా మార్పిడి చేసుకోవచ్చంటూ బ్యాంకులు ఇచ్చిన నోటిఫికేషన్లపై సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్‌ దాఖలు అయ్యింది. అయితే, దీనిని అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం.. వేసవి సెలవుల సమయంలో అటువంటి అభ్యర్థనను స్వీకరించమని స్పష్టం చేసింది.

రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు (Rs 2,000 note exchange) ఎటువంటి దరఖాస్తు, ఐడీ ప్రూఫ్‌ అవసరం లేదనడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆధార్‌ వంటివి అవసరం లేకున్నా వీటిని తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్ప సమయంలోనే రూ.50వేల కోట్ల విలువైన పెద్ద నోట్ల మార్పిడి జరిగిందన్న ఆయన.. నేరస్థులు, ఉగ్రవాదులు దీన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టులోని జస్టిస్‌ సుధాన్షు దులియా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. వేసవి సెలవుల్లో ఈ తరహా కేసులు విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, రూ.2వేల నోట్లను మార్పిడికి ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేదని ఆర్‌బీఐ, ఎస్‌బీఐ ఇచ్చిన ప్రకటనలపై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పరిశీలించిన న్యాయస్థానం.. మే 29న ఆ పిల్‌ను తోసిపుచ్చింది. తాజాగా సుప్రీంకోర్టులో దీనిని అప్పీల్‌ చేయగా, వేసవి సెలవుల్లో అత్యవసరంగా విచారించలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని