Sedition Law: అప్పటిదాకా రాజద్రోహ చట్టాన్ని నిలిపివేస్తారా? కేంద్రానికి సుప్రీం ప్రశ్న

బ్రిటిష్‌ వలస పాలన నాటి రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) చట్టాన్ని పునః పరిశీలించేంత వరకు ఈ చట్టాన్ని నిలిపివేస్తారా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఈ చట్టం కింద నమోదు చేసిన

Updated : 10 May 2022 18:12 IST

దిల్లీ: బ్రిటిష్‌ వలస పాలన నాటి రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) చట్టాన్ని పునః పరిశీలించేంత వరకు ఈ చట్టాన్ని నిలిపివేస్తారా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఈ చట్టం కింద నమోదు చేసిన కేసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అడిగింది. వీటికి రేపటి లోగా సమాధానం చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది.

రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని తామే పునఃపరిశీలిస్తామని, సెక్షన్‌లోని నిబంధనల చెల్లుబాటును పరిశీలించేందుకు న్యాయస్థానం సమయం వెచ్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ అఫిడవిట్‌ను మంగళవారం పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.

‘‘రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం చెప్పింది. దీనికి ఎంత సమయం పడుతుంది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఈ చట్టం కింద ఇప్పటివరకు ఉన్న నమోదైన పెండింగ్‌ కేసులు.. భవిష్యత్‌లో నమోదయ్యే కేసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది.. అనే వాటిని ఆలోచించాలి. ప్రభుత్వం దీన్ని పునః పరిశీలించేంత వరకు రాజద్రోహం చట్టం అమలను నిలిపివేస్తుందా? అప్పటిదాకా ఈ చట్టం కింద కేసులను నమోదు చేయొద్దని కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు చెప్పకూడదు?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

దీనికి కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా స్పందిస్తూ.. ఈ ప్రశ్నలపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ఈ చట్టంపై మార్గదర్శకాలను రూపొందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు బుధవారం వరకు కేంద్రానికి గడువిచ్చింది. ఈ ప్రశ్నలకు కేంద్రం రేపు సమాధానం చెప్పాలని ధర్మాసనం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని