Bihar: ఆనంద్‌ మోహన్‌ విడుదలపై నీతీశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఐఏఎస్‌ అధికారి హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ ముందస్తు విడుదలపై వివరణ ఇవ్వాలని బిహార్‌ (Bihar) ప్రభుత్వానికి సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. 

Published : 08 May 2023 20:45 IST

దిల్లీ: ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ (Anand Mohan) విడుదలపై సుప్రీం కోర్టు (Supreme Court) బిహార్‌ (Bihar) ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆనంద్‌ మోహన్‌ ముందస్తు విడుదలను సవాలు చేస్తూ కృష్ణయ్య భార్య ఉమాదేవి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని ముందస్తుగా విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని బిహార్‌ ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ, ఆనంద్‌ మోహన్‌లకు నోటీసులు జారీ చేసింది.

‘‘మరణశిక్షకు బదులుగా జీవితఖైదు విధించినప్పుడు.. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ శిక్షను కచ్చితంగా అమలు చేయాలి. మధ్యలో నిందితుడికి ఎలాంటి ఉపశమనం కలిగించకూడదు’’ అని ఉమాదేవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె తరపున న్యాయవాది సిద్ధార్థ్‌ లుత్రా వాదనలు వినిపిస్తూ ఆనంద్‌ మోహన్‌ విడుదల దురదృష్టకరమైన అంశమని వ్యాఖ్యానించారు. 

1994లో గోపాల్‌గంజ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌గా తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ అధికారి జి. కృష్ణయ్య పనిచేస్తున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ హింసలో ఆనంద్‌ మోహన్‌ తన అనుచరులతో కలిసి చేసిన మూక దాడిలో కృష్ణయ్య మృతిచెందారు. ఈ కేసులో నేరం నిరూపణ కావడంతో ఆనంద్‌ మోహన్‌కు బిహార్‌ దిగువ కోర్టు మరణ శిక్ష విధించింది. తర్వాత ఈ తీర్పుపై విచారణ చేపట్టిన పట్నా హైకోర్టు ఈ శిక్షను జీవితఖైదుగా మార్చింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడంతో గత 15 ఏళ్లుగా ఆనంద్‌ మోహన్‌  జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 

గత నెలలో ఆనంద్‌ మోహన్‌ విడుదల కోసం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం జైలు మాన్యువల్‌లో మార్పులు చేసింది. ఈ క్రమంలో ఆనంద్‌తో పాటు మరో 27 మంది ఖైదీలను విడుదల చేస్తూ బిహార్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత నెల 27న ఆనంద్‌ మోహన్‌ జైలు నుంచి విడులయ్యారు. దీన్ని సవాలు చేస్తూ కృష్ణయ్య భార్య ఉమాదేవి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని