Supreme Court: ‘కోటా ఆత్మహత్యలను ప్రస్తావించొద్దు’.. నీట్‌ పిటిషన్లపై సుప్రీం

Supreme Court: కోటాలో చోటుచేసుకుంటున్న వరుస ఆత్మహత్యలకు నీట్‌ ఫలితాలతో సంబంధం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ వాదనను తేవొద్దని పిటిషనర్లకు సూచించింది. అసలేం జరిగిందంటే..?

Updated : 14 Jun 2024 13:52 IST

దిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. నీట్‌ పరీక్ష (NEET UG 2024 Exam)లో పేపర్‌ లీక్‌, ఇతర అక్రమాలపై సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. ఈ విచారణ సందర్భంగా కోటా ఆత్మహత్యల ప్రస్తావన తీసుకురాగా.. సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సున్నితంగా మందలించింది.

నీట్‌ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన ఓ న్యాయవాది.. రాజస్థాన్‌లోని కోటా (Kota Suicides) నగరంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘కోటాలో ఆత్మహత్యలకు నీట్‌ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర, భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయొద్దు’’ అని సూచించింది.

గ్రేస్‌ మార్కులు రద్దు.. ఆ 1563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం

అనంతరం ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి సుప్రీం నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు సీబీఐ, బిహార్‌ ప్రభుత్వానికి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. నీట్‌ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్‌ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని స్పష్టం చేసింది. బిహార్‌లో నీట్ (NEET Exam) ప్రశ్నాపత్నం లీకైనట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్‌ మార్కులను రద్దు చేస్తున్నట్లు నిన్న కేంద్రం సుప్రీంకోర్టు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు