Updated : 01 Jul 2022 14:51 IST

Nupur Sharma: నుపుర్‌ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి

ఆమె వ్యాఖ్యల కారణంగానే దేశంలో దురదృష్టకర ఘటనలు

భాజపా నాయకురాలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

దిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారానికి తెరలేపిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యల అనంతరం దేశంలో జరిగిన ఘటనలకు ఆమే బాధ్యురాలని న్యాయస్థానం మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది.

ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమం సందర్భంగా నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే గాక, అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన భాజపా.. ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈ వ్యాఖ్యలకు గానూ ఆమెపై దేశంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఈ కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్‌.. ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడింది.

భావోద్వేగాలను రెచ్చగొట్టారు..

‘‘ఆమెకు ముప్పు ఉందా? లేదా ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా?టీవీలో జరిగిన చర్చ అంతా చూశాం. ఆమె వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఆమె తన వ్యాఖ్యల ద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ఆమె వ్యాఖ్యల అనంతరం దేశంలో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటికీ పూర్తి బాధ్యురాలు ఆమే. ఉదయ్‌పుర్‌లో జరిగిన దారుణ ఘటనకూ ఆమే కారణం. పార్టీ అధికార ప్రతినిధి అయితే ఇష్టానుసారంగా మాట్లాడుతారా? తన వెనుక అధికారం ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చని ఆమె అనుకుంటున్నారు. ఆమె పెట్టిన కేసుల్లో ఉన్న వ్యక్తులను వెంటనే అరెస్టు చేశారు. కానీ, ఆమెపై నమోదైన కేసుల్లో మాత్రం నుపుర్‌ను అరెస్టు చేయడానికి ఎవరూ సాహసం చేయలేదు. ఆమె వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులకు ఏ మతంపైనా గౌరవం లేదని తెలుస్తోంది. అనుచిత వ్యాఖ్యలు చేసి మంటలు రేపినందుకుగానూ టీవీ ముందుకొచ్చి  ఆమె ఈ దేశానికి క్షమాపణలు చెప్పాలి’’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది.

అయితే డిబేట్‌లో భాగంగా టీవీ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు మాత్రమే నుపుర్‌ సమాధానం చెప్పారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అయితే అప్పుడు టీవీ యాంకర్‌పైనా కేసు పెట్టి, చర్యలు తీసుకోండి అని సూచించింది. ఈ సందర్భంగా.. నుపుర్‌ శర్మపై నమోదైన కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆమె తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీంతో నుపుర్‌ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని