Updated : 11 May 2022 13:37 IST

Sedition Law: రాజద్రోహ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే..

సమీక్ష పూర్తయ్యేదాకా కొత్త కేసులు నమోదు చేయొద్దన్న న్యాయస్థానం

దిల్లీ: వలస పాలకుల నాటి రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ తెలియజేసిన నేపథ్యంలో.. అప్పటిదాకా ఈ చట్టం అమలుపై స్టే విధించింది. కేంద్రం పునఃపరిశీలన పూర్తయ్యే వరకూ ఈ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించింది.

రాజద్రోహ చట్టాన్ని సమీక్షించనున్న నేపథ్యంలో ఈ చట్టం కింద ఇప్పటికే నమోదైన కేసులు, భవిష్యత్తులో నమోదయ్యే కేసుల గురించి ప్రభుత్వం ఎటువంటి వైఖరి అనుసరించబోతుందో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు నిన్న కేంద్రాన్ని ఆదేశించింది. సమీక్ష పూర్తయ్యే వరకు ఆ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయవచ్చు కదా అని సూచించింది.

దీనిపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మోహతా నేడు కోర్టుకు వివరణ ఇచ్చారు. ‘‘సమీక్ష పూర్తయ్యేంతవరకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా నిలిపివేయడం అనేది సరైన విధానం కాదు. తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేం. ప్రతి కేసు తీవ్రతను చెప్పలేం. కొన్ని ఉగ్రకోణంలో ఉండొచ్చు. లేదా మనీలాండరింగ్‌ కేసులైనా కావొచ్చు. అయితే ఈ కేసులను పరిశీలించేందుకు ఓ ఆఫీసర్‌ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎస్పీ ర్యాంక్‌ అధికారి నేర తీవ్రతను పరిశీలించి ఆమోదిస్తేనే కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలనుకుంటున్నాం. పెండింగ్‌ కేసులను న్యాయపరమైన ఫోరమ్‌ ముందు పరిశీలించాలి’’ అని తుషార్‌ మోహతా వివరించారు. 

అయితే కేంద్రం వాదనతో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు. ‘‘ఈ చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం చెప్పింది. చట్టాన్ని దుర్వినయోగం చేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారు. హనుమాన్‌ చాలిసా పఠించినా రాజద్రోహం అభియోగాలు మోపుతున్నారని అటార్నీ జనరల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టంపై సమీక్ష పూర్తయ్యేంత వరకూ రాజద్రోహ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు. అందువల్ల పునఃపరిశీలన పూర్తయ్యేంతవరకు దీని అమలుపై స్టే విధిస్తున్నాం. అప్పటిదాకా ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయబోవని విశ్వసిస్తున్నాం. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చు’’ అని సీజేఐ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు కూడా బెయిల్‌ కోసం న్యాయస్థానాలకు వెళ్లవచ్చని సీజేఐ సూచించారు. 

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని