The Kerala Story: పశ్చిమ బెంగాల్‌లో నిషేధం.. ‘స్టే’ విధించిన సుప్రీంకోర్టు

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రంపై పశ్చిమబెంగాల్‌ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) నిలిపివేసింది. ఈ సినిమా సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పొందినందున శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

Updated : 18 May 2023 18:18 IST

దిల్లీ: ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువరించింది. తమిళనాడులోనూ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. చిత్రంలో వివాదాస్పదంగా మారిన ఓ అంశం గురించి మార్పు చేయాలని (Disclaimer) నిర్మాతకూ సూచించింది. సీబీఎఫ్‌సీ  (CBFC) ధ్రువీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ఆ చిత్రాన్ని ఓసారి చూడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘ప్రజల అసహనాన్ని కారణంగా చూపుతూ చట్టపరమైన నిబంధనలను ఉపయోగించలేరు. లేదంటే, అన్ని సినిమాలది ఇదే పరిస్థితి. ఈ సినిమా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (CBFC) ధ్రువీకరణ పొందినందున శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’ అని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన సీజేఐ ధర్మాసనం పేర్కొంది. చెడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది.

‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని పశ్చిమబెంగాల్‌ నిషేధించడంతోపాటు తమిళనాడులోని పలు థియేటర్ల ఓనర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించవద్దని నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ చిత్ర నిర్మాత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు చిత్ర విడుదలపై స్టే ఇవ్వడాన్ని నిరాకరిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జర్నలిస్ట్‌ కుర్బాన్‌ అలీ కూడా సుప్రీంలో పిటిషన్‌ వేశారు. ఇలా ఈ చిత్రానికి సంబంధించిన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నిర్మాత తరఫున న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఇదిలాఉంటే, మే 5న ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే సుమారు రూ.150 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని