Hijab Row: సుప్రీం కోర్టుకు చేరిన ‘హిజాబ్‌’ వివాదం..!

కర్ణాటక హైకోర్టులో హిజాబ్‌ వివాదంపై నడుస్తోన్న కేసులను సుప్రీంకు బదిలీ చేసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను పరిశీలిస్తామని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Updated : 10 Feb 2022 19:07 IST

లిస్టింగ్‌ను పరిశీలిస్తామన్న చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

దిల్లీ: కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం చివరకు సుప్రీం కోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతుండగా.. తాజాగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. ముఖ్యంగా కర్ణాటక హైకోర్టులో హిజాబ్‌ వివాదంపై నడుస్తోన్న కేసులను సుప్రీంకు బదిలీ చేసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన భారత అత్యున్నత న్యాయస్థానం.. లిస్టింగ్‌ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. అయితే, ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున.. కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత దీనిని పరిశీలిస్తామని పిటిషనర్‌కు సూచించింది.

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణలో ఉన్న కేసులను బదిలీ చేసుకోవడంతోపాటు తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. ఈ వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది’ అని కపిల్‌ సిబల్‌ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై ప్రస్తుతం ఎటువంటి ఆదేశాలు కోరుకోవడం లేదని.. కేవలం తమ విజ్ఞప్తిని లిస్టింగ్‌ చేసుకోవాలని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. దీనికి స్పందించిన చీఫ్‌ జస్టిస్.. ‘అలాగే.. పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడే ఈ కేసును సుప్రీంకోర్టులో లిస్టింగ్‌ చేస్తే హైకోర్టు విచారణ జరిపేందుకు ఆస్కారం ఉండదని వెల్లడించారు.

అదే సమయంలో సుప్రీం ధర్మాసనంలో ఉన్న జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీలు స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఈ కేసును హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సమయంలో మేము ఏమీ చేయలేం. అత్యవసరంగా ఈ కేసును టేకప్‌ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడే అందులో జోక్యం చేసుకోలేం. త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారిస్తోంది. అక్కడ విచారణ జరగనివ్వండి. హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం’ అని పిటిషనర్‌ తరపున న్యాయవాదికి సూచించారు.

ఇదిలాఉంటే, ఇప్పటికే హిజాబ్‌పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టులోని ఏకసభ్య ధర్మాసనం.. దీనిపై మరింత విస్తృతంగా విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకే దీనిపై విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ సిఫార్సు చేశారు. మరోవైపు ఈ అంశంపై హైకోర్టులో బుధవారం మరో 5 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరుపుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని