Pegasus: పెగాసస్‌పై విచారణకు సుప్రీం ఓకే

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దానిపై దాఖలైన పిటిషన్లను శుక్రవారం స్వీకరించింది. పనిభారాన్ని బట్టి వచ్చేవారం వాటిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వెల్లడించారు. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌)ను ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో కోర్టు స్పందించింది.

Published : 30 Jul 2021 12:11 IST

వచ్చేవారం విచారణ జరపనున్న సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లను శుక్రవారం స్వీకరించింది. పనిభారాన్ని బట్టి వచ్చేవారం వాటిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ వెల్లడించారు. పెగాసస్‌పై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌)ను ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.  

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్, తృణమూల్‌ కాంగ్రెస్ అగ్రనేత, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పార్లమెంట్‌ దద్దరిల్లుతోంది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా జరిగే వీలులేకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అలాగే రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. హ్యాకింగ్‌పై కేంద్రం సమాధానం చెప్పాలని వారంతా పట్టుపట్టారు. మరోపక్క మమతా బెనర్జీ ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. కేంద్రం మాత్రం ఇవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని