
PM’s Security Breach: మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకు చేరిన వివాదం
విచారణ కమిటీ ఏర్పాటు చేసిన పంజాబ్ ప్రభుత్వం
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భారీ భద్రతా వైఫల్యం వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. దీనిపై సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం విచారణ జరపనుంది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి, పంజాబ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మెహ్తాబ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ వర్మలతో కూడిన ఈ కమిటీ ఘటనపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
నిఘా వర్గాలు హెచ్చరించినా..
మరోవైపు పంజాబ్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ మరిన్ని సంచలన ఆరోపణలు చేసింది. ఆందోళనలపై నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ.. పంజాబ్ పోలీసులు నిర్లక్ష్య్ంగా వ్యవహరించారని మండిపడింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ‘బ్లూ బుక్’ను ఆ రాష్ట్ర పోలీసులు పాటించలేదని కేంద్రహోం శాఖ సీనియర్ అధికారి ఒకరు ఆరోపించారు. ‘‘ప్రధానమంత్రి భద్రత ఏర్పాట్లకు పాటించాల్సిన మార్గదర్శకాలన్నీ ‘బ్లూబుక్’లో ఉంటాయి. దీని ప్రకారం.. ప్రధాని పర్యటనలో నిన్నటిలా ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రాలు ఆకస్మిక మార్గాన్ని సిద్ధం చేయాలి. అనూహ్య ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర పోలీసులు.. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు అప్డేట్ చేసి అందుకు అనుగుణంగా వీఐపీల ప్రయాణాలను మార్చాలి. కానీ, పంజాబ్ పోలీసులు అలా చేయలేదు. అంతేగాక, నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు పంజాబ్ పోలీసులతో కాంటాక్ట్‌లోనే ఉంటూ.. ఆందోళనలకారుల గురించి అప్రమత్తం చేశాయి. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు’’ అని సదరు అధికారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటనలో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఫిరోజ్‌పుర్ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడంతో ప్రధాని, ఆయన వాహనశ్రేణి 15-20 నిమిషాల పాటు పైవంతెనపై చిక్కుకుపోయారు. దీంతో తన పర్యటనను అర్ధంతరగా ముగించుకుని దిల్లీ వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై భాజపా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీకి భౌతికంగా హాని కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, వరుస ఓటములు ఆ పార్టీని ఉన్మాద మార్గంలోకి నెట్టాయని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.