SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇది భారత్‌లో ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం (Supreme Court).. వచ్చే వారం విచారిస్తామని వెల్లడించింది.
దిల్లీ: 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని విమర్శిస్తూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై (BBC documentary) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో దీనిని ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని చూసే పౌరులను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని.. ఈ నేపథ్యంలో దీనిపై దాఖలైన పిల్‌లను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరారు. పరిశీలించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే సోమవారం వీటిని విచారిస్తామని వెల్లడించింది.
బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై తాము దాఖలు చేసిన పిటిషన్లను అత్యవసర జాబితాలో చేర్చి విచారించాలని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తరఫున న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీనియర్ అడ్వకేట్ సీయూ సింగ్‌లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పౌరులు, విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారని.. అందుకే దయచేసి ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై వచ్చే నివేదికలు, వార్తలు, వాస్తవాలను చూసే హక్కు పౌరులకు ఉందో లేదోననే విషయాన్ని కూడా సుప్రీం కోర్టు నిర్ణయించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ తన పిల్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జనవరి 21న ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. వీటిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జే బీ పార్దీవాలా ధర్మాసనం.. వచ్చే వారం విచారణ చేపడతామని తెలిపింది.
‘‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్‌ను యూట్యూబ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు నెటిజన్లకు అందుబాటులో ఉంచాయి. ఇవి కాస్త వివాదాస్పదమైనవని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ లింకులను వెంటనే నిలుపు చేయాలంటూ జనవరి 21న ఆయా సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. ఆ డాక్యుమెంటరీపై మనదేశంలో భాజపా వర్గాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు భారతీయులు విమర్శలు గుప్పించారు.
సుప్రీం సమయం వృథా చేయడమే : కిరణ్ రిజుజు
బీబీసీ డాక్యుమెంటరీని బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్న వారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు మండిపడ్డారు. వేల మంది సామాన్యులు న్యాయం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో ఇలాంటి పిటిషన్లు వేయడం సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వృథా చేయడమేనన్నారు. బీబీసీ డాక్యుమెంటరీని ప్రజలు చూడకుండా ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం ధర్మాసనం అంగీకరించిందని వచ్చిన వార్తలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ విధంగా స్పందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి