రాందేవ్‌ పిటిషన్‌పై జులై 12న విచారణ

‘అలోపతి’ వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలు సంబంధించి జరుగుతున్న దర్యాప్తుపై స్టే విధించాలని యోగా గురు బాబా రాందేవ్‌ వేసిన పిటిషన్‌పై జులై 12న విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు

Updated : 05 Jul 2021 21:54 IST

దిల్లీ: ‘అలోపతి’ వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తుపై స్టే విధించాలని యోగా గురు బాబా రాందేవ్‌ వేసిన పిటిషన్‌పై జులై 12న విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. నిజానికి దీనిపై నేడు విచారణ జరగాల్సి ఉండగా.. రాందేవ్‌ చేసిన వ్యాఖ్యల ఒరిజినల్‌ రికార్డులు ఆదివారం అర్ధరాత్రి కోర్టుకు అందాయి. దీంతో ఈ విచారణను వాయిదా వేస్తున్నట్లు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

‘‘రాందేవ్‌ వ్యాఖ్యలకు సంబంధించి పెద్దమొత్తంలో వీడియోలు, కాపీలు మాకు నిన్న రాత్రి 11 గంటల సమయంలో వచ్చాయి. అందుకే ఈ పిటిషన్‌పై విచారణను వారం తర్వాత చేపడతాం’’ అని సీజేఐ తెలిపారు. ఈ వీడియోలను, కాపీలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

కరోనా సమయంలో అలోపతి ఔషధాల వినియోగంపై రాందేవ్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాందేవ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆయనకు లేఖ రాశారు. దీంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే ఆయనపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేయడంతో పట్నా, రాయ్‌పుర్‌లో కేసులు నమోదయ్యాయి.

ఈ వ్యవహారంపై రాందేవ్‌బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల దర్యాప్తుపై స్టే విధించాలని, తనపై వేర్వేరు చోట్ల నమోదైన ఈ కేసులన్నింటినీ కలిపేసి, దిల్లీకి బదిలీ చేయాలంటూ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒరిజినల్‌ రికార్డులు కావాలని కోరింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు