Supreme Court: హిజాబ్‌ పిటిషన్ల విచారణకు బెంచ్ ఏర్పాటు చేస్తాం

విద్యాసంస్థల్లో హిజాబ్‌(Hijab)పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఒక ధర్మాసనాన్ని...

Published : 03 Aug 2022 00:50 IST

సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ వెల్లడి

దిల్లీ: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌(Hijab)పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు(Supreme Court) మంగళవారం తెలిపింది. హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ మార్చిలో అప్పీళ్లు దాఖలయ్యాయని.. విచారణ కోసం వాటిని ఇంకా లిస్టింగ్‌ చేయలేదని సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోరా చేసిన వాదనలను సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ(Justice NV Ramana), జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘ఈ పిటిషన్లపై విచారణకు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తాం. న్యాయమూర్తుల్లో ఒకరు అనారోగ్యంగా ఉన్నారు. వారు బాగానే ఉంటే.. ఈపాటికే విచారణకు వచ్చేవి’ అని సీజేఐ తెలిపారు.

హిజాబ్‌ వస్త్రధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జులై 13న సుప్రీం కోర్టు అంగీకరించింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో హిజాబ్‌ వివాదం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. హిజాబ్‌.. ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది. విద్యాసంస్థల్లో ఏకరూప వస్త్రాల నిబంధనలను పాటించాలన్న రాష్ట్ర సర్కారు ఆదేశాన్ని సమర్థించింది. అయితే, ఈ తీర్పు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని.. రాజ్యాంగంలోని 15వ అధికరణం దేశ ప్రజలకు కల్పించిన మత, సాంస్కృతిక, భావ ప్రకటనా స్వేచ్ఛను ఇది హరిస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దీన్ని సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని