ED: మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టులకు సంబంధించిన సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులకు ఉండే విచారణ, అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి అధికారాల్ని

Updated : 27 Jul 2022 13:59 IST

దిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులకు ఉండే విచారణ, అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి అధికారాల్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ అరెస్టులు ఏకపక్షం కాదని పేర్కొంది. ఈ మేరకు మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని ప్రొవిజన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టేసింది.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కొన్ని ప్రొవిజన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం గతంలో విచారణ జరిపి నేడు తుది తీర్పు వెలువరించింది. ఈ చట్టంలోని కఠిన ప్రొవిజన్లు సమర్థనీయమైనవే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుల్లో ఈడీ అధికారులకు సోదాలు చేయడం, అరెస్టులు, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి అధికారాలు ఉంటాయని పేర్కొంది. బెయిల్‌కు ఉన్న షరతులను కూడా కోర్టు సమర్థించింది.

ఈడీ అధికారులు పోలీసులు కాదు..

ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పోలీసులు కాదు.. అందువల్ల విచారణ సమయంలో వారు రికార్డ్‌ చేసే వాంగ్మూలాలను చట్టబద్ధమైన సాక్ష్యంగానే పరిగణించొచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక, మనీలాండరింగ్‌ కేసుల్లో ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్ -ఫిర్యాదు కాపీ‌)ని ప్రతిసారీ నిందితులకు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. నిందితులను అరెస్టు చేసే సమయంలో ఫిర్యాదు వివరాలను చెబితే సరిపోతుందని తెలిపింది. ఈసీఐఆర్‌ అనేది ఎఫ్‌ఐఆర్‌ కాదని పేర్కొంది. ఈ చట్టం కింద బెయిల్‌కు ఉన్న రెండు షరతులు చట్టబద్ధమైనవే అని, అవి ఏమాత్రం ఏకపక్షంగా లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

పిటిషనర్ల వాదన ఇది..

ప్రస్తుతం మనీ లాండరింగ్‌ చట్టం కింద ఈడీకి ఉన్న అరెస్టు అధికారాలు, బెయిల్ మంజూరు, ఆస్తుల స్వాధీనం వంటివన్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వెలుపలే ఉన్నాయి. అయితే ఈడీ అధికారులు పూర్తిగా పోలీసు అధికారుల్లాగే వ్యవహరిస్తున్నందున.. దర్యాప్తు సమయంలో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను పాటించాలని పిటిషనర్లు వాదిస్తున్నారు. దర్యాప్తు సమయంలో నిందితులు సమర్పించే వాంగ్మూలాలను.. వారికి బెయిల్ వ్యతిరేకించడానికి సాక్ష్యాలుగా ఉపయోగిస్తున్నారని, ఇది నిందితుడి హక్కులను ఉల్లంఘించడమే అని పిటిషనర్లు చెబుతున్నారు. దర్యాప్తును ప్రారంభించడం, నిందితుడు లేదా సాక్ష్యులను విచారించడానికి సమన్లు పంపడం, వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయడం, ఆస్తుల స్వాధీనం కోసం ఈడీ అనుసరిస్తున్న విధానాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని పేర్కొంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్ కేసులో గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష ఉన్నప్పటికీ బెయిల్ పొందడం చాలా కష్టతరమని, బెయిల్‌కు ఉన్న షరతులు చాలా కఠినంగా ఉన్నాయని ఆరోపించారు. అయితే పిటిషనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చుతూ నేడు తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు