Puri temple: పూరీ ఆలయంలో స్కూల్‌ పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్.. అప్పటివరకే!

ప్రఖ్యాత పూరీ ఆలయంలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక క్యూ లైన్‌ (తాత్కాలికంగా) ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. నిన్న జరిగిన స్వల్ప తోపులాటలో తొమ్మిది మంది బాలికలకు గాయాలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Published : 27 Dec 2022 22:55 IST

పూరీ: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో నిన్న జరిగిన స్వల్ప తోపులాటలో తొమ్మిది మంది బాలికలకు స్వల్ప గాయాలైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు  ఆలయానికి వస్తుండటంతో వారి కోసం ప్రత్యేక క్యూలైన్‌(తాత్కాలికంగా) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సోమవారం తొమ్మిది మంది బాలికలు స్వల్పంగా గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించి ఈరోజు డిశ్చార్జి చేసి ఇంటికి తరలించినట్టు పూరీ ఎస్పీ కేవీ సింగ్‌ వెల్లడించారు. 

పాఠశాలలకు సెలవులు ఉండటంతో అనేకచోట్ల నుంచి విద్యార్థులు పిక్నిక్‌ల కోసం పూరీకి వస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ సెలవుల తర్వాత విద్యార్థుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఉండబోవని స్పష్టంచేశారు. మయూర్‌భంజ్‌ జిల్లా రాస్‌గోవింద్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ పాఠశాల నుంచి నిన్న 70మంది విద్యార్థులు పూరీ ఆలయాన్ని దర్శించుకొనేందుకు వచ్చారు. అయితే,  నిన్న రాత్రి 8గంటల సమయంలో మెట్లు ఎక్కుతుండగా స్వల్పంగా జరిగిన తోపులాటలో బాలికలు స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించినట్టు ఎస్పీ తెలిపారు. వీరంతా డీహైడ్రేషన్‌కు గురికావడంతో సైలైన్‌ బాటిళ్లు ఎక్కించినట్టు వివరించారు. మెట్లు వద్దకు చేరుకోవడానికి ముందు వీరంతా దాదాపు రెండు గంటల పాటు క్యూలైన్‌లోనే ఉన్నారని తెలిపారు. ఈ రోజు ఉదయం అందరూ డిశ్చార్జి అయ్యారని.. వారి స్వస్థలాలకు వెళ్లిపోయారని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని