
కొత్త కరోనా: శాస్త్రీయ సమాచారమిదే!
వాషింగ్టన్: చాలా సులభంగా, త్వరితంగా వ్యాప్తిస్తుందా?మరింత హాని చేస్తుందా?చికిత్సలకూ, వ్యాక్సిన్‌కూ లొంగదా? ఇటీవల పొడచూపిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ (రకం) కంటే కూడా ప్రజల్లో వేగంగా వ్యాప్తిస్తున్న సందేహాలివి. ప్రత్యేకించి ఇటీవల బ్రిటన్ తదితర విదేశాలకు వెళ్లి వచ్చినవారు, వారి సంబంధీకులు పలు అనుమానాలతో సతమతమౌతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు అందించిన శాస్త్రీయ సమాచారమిదే..
కొత్త కరోనా ఎక్కడ నుంచి వచ్చింది?
బ్రిటన్ కరోనా రకాన్ని తొలుత సెప్టెంబర్‌లో కనుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దక్షిణాఫ్రికాలో కూడా మరో రకం కొవిడ్ తలెత్తినట్టు తెలుస్తోంది. కొత్త పరివర్తనలు చోటుచేసుకోవటం అంటే స్వల్ప మార్పులకు గురికావటం వైరస్లలో సర్వ సాధారణం. సుమారు ఏడాది క్రితం చైనాలో వెల్లడైన నాటి నుంచి కొవిడ్-19 వైరస్‌లో అనేక వైవిధ్యాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు స్థలాలు, వ్యక్తులు, పరిస్థితులను బట్టి వాటిలో మార్పు వస్తూనే ఉంటుంది. ఐతే ఈ విధంగా వచ్చే మార్పులు చాలావరకు సామాన్యంగానే ఉంటాయి. వాటిని పూర్తి అక్షరమాలలో తొలుత వచ్చే అ,ఆ లతో పోల్చవచ్చని డాక్టర్ ఫిలిప్ లాండ్రిగన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త అంటారు. అయితే కరోనా తన ఉపరితలంపై ఉన్న ప్రొటీన్లు మార్పుచెంది.. ఔషధాలకు, టీకాలకు లొంగని విధంగా మారితే మాత్రం సమస్యాత్మకమే.
ఇది ఎప్పుడు ప్రమాదకరమవుతుంది?
సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు వంటి వాటి ద్వారా ఒక ప్రాంతంలో విపరీతంగా వ్యాప్తి చెందితే.. సమస్యాత్మకంగా మారే అవకాశముంది. పరివర్తనల వల్ల వైరస్‌కు మరింత వేగంగా వ్యాప్తి చెందే సామర్ధ్యం లభించడం వంటి అదనపు సామర్థ్యం చేకూరటం ప్రమాద కారకం కావచ్చు. కాగా..బ్రిటన్‌లో తలెత్తిన కొత్త కరోనాకు ఈ మాదిరి శక్తి ఉందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా, మిగిలిన కొవిడ్ మ్యుటేషన్స్‌తో పోలిస్తే దీనికి వేగంగా, ఎక్కువ మందికి సోకే శక్తి ఉందని డాక్టర్ లాండ్రిగన్ అంటున్నారు.
బ్రిటిష్ రకం కరోనాతో సమస్యేమిటి?
బ్రిటన్ కరోనా స్ట్రెయిన్‌లో సుమారు 24 రకాల పరివర్తనలు సంభవించాయి. వీటిలో ఎనిమిది.. మానవ కణాల్లో ప్రవేశించేందుకు ఉపకరించే అతి ముఖ్యమైన స్పైక్ ప్రొటీన్‌కు సంబంధించినవి. నిజానికి ఈ స్పైక్ ప్రొటీన్‌ను నిరోధించటమే లక్ష్యంగా వ్యాక్సిన్లు, యాంటీబాడీలతో కూడిన ఔషధాలను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండులో ఉన్న కరోనా, సాధారణ మహమ్మారి కంటే రెండు రెట్లు సోకే లక్షణాన్ని అధికంగా కలిగిఉందని డాక్టర్ రవి గుప్తా అనే వైరస్ నిపుణుడు తెలిపారు.
ఇది మరింత అనారోగ్యం, మరణాలకు దారితీస్తుందా?
నిజానికి ఈ విషయం ఇప్పటి వరకు రుజువు కాలేదు. అయితే ఆ విధమైన ప్రమాదం రాకుండా నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలి. కొత్త రకం కరోనా ఎక్కువమందికి వ్యాప్తిస్తున్న నేపథ్యంలో.. ఇది మరింత ప్రమాదకరమా అనేది త్వరలోనే తెలియనుంది. ఐతే దీనివల్ల అనారోగ్యంలో కానీ, వ్యాధి తీవ్రతలో కానీ మార్పులేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణురాలు మారియా వాన్ కెర్ఖోవే వెల్లడించారు.
చికిత్సపై పరివర్తనల ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం వాడుతున్న ఔషధాలు శరీరానికి యాంటీబాడీలను అందించటం ద్వారా వైరస్‌పై పనిచేస్తాయి. ఇంగ్లాండులో బయటపడిన అనేక కేసుల్లో.. రెండింటిలో చోటుచేసుకున్న పరివర్తనలు.. కరోనా ఔషధాల సామర్ధ్యం విషయమై సందేహాలను రేకెత్తిస్తున్నాయి. కాగా, కొత్తరకంపై యాంటీబాడీల స్పందనను గురించి విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి.
వ్యాక్సిన్లపై ప్రభావం సంగతేంటి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్త కరోనాపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కేవలం యాంటీబాడీలు తయారయ్యేందుకు దోహదం చేయటమే కాకుండా.. రోగనిరోధక శక్తి విస్తృతంగా స్పందించేలా ప్రేరేపించటం వ్యాక్సిన్ల లక్షణం. ఈ కారణం వల్లనే అవి కొత్త రకం కరోనాపై కూడా ప్రభావం చూపుతాయని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త కరోనా రకం, తాము వాడుతున్న వ్యాక్సిన్లపై ప్రభావం చూపటం లేదని బ్రిటన్ అధికారులు స్పష్టం చేశారు.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
సాధారణ కరోనా కట్టడికి ప్రజారోగ్య నిపుణులు సూచించే.. మాస్క్ ధరించటం, చేతులను తరచు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరం పాటించటం, జన సమూహాల్లోకి వీలైనంత వరకు వెళ్లకపోవటం తదితర మార్గదర్శకాలనే కొత్త కరోనా విషయంలోనూ పాటించాలి.
ఇవీ చదవండి..
మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!
కరోనా 2.0తో మనకు మళ్లీ భయం తప్పదా?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.