Jyotiraditya Scindia: మధ్యప్రదేశ్‌కు జ్యోతిరాదిత్య గిఫ్ట్‌.. కేవలం 35 రోజుల్లో 44 కొత్త విమానాలు!

తాను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 35 రోజుల్లోనే 44 కొత్త విమానాలను మధ్యప్రదేశ్‌ నుంచి ప్రారంభించానని .....

Updated : 18 Aug 2021 22:18 IST

ఇండోర్‌: తాను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 35 రోజుల్లోనే 44 కొత్త విమానాలను మధ్యప్రదేశ్‌ నుంచి ప్రారంభించానని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ప్రస్తుతం జబల్పూర్ నుంచి ముంబయి, పుణె, సూరత్‌, హైదరాబాద్‌, కోల్‌కతాకు విమానాలు ఎగురుతున్నాయన్నారు. ఆగస్టు 20 నుంచి జబల్పూర్‌ నుంచి దిల్లీ, ఇండోర్‌లకు కూడా సేవలందిస్తాయని పేర్కొన్నారు.  వీటిలో ఎనిమిది విమానాలు ఉడాన్‌ పథకం కింద ఉండనున్నాయి. ఉడాన్‌ పథకంలో భాగంగా చిన్న విమానాశ్రయాలను మెట్రో నగరాలు, ఇతర నగరాలకు అనుసంధానించడంపై కేంద్రం దృష్టిసారించిదన్నారు. 

ఆ విషయం ప్రధాని పదేపదే చెప్పారు!

బుధవారం ఇండోర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సింధియా మాట్లాడుతూ.. సరసమైన ధరలకే విమాన ప్రయాణం సామాన్యుడికి అందించడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. గత నాలుగేళ్లలో దేశీయ పౌర విమానయాన రంగం విస్తరణలో భాగంగా చిన్న చిన్న పట్టణాల్లో కొత్త విమానాశ్రయాలు తెరవడంతో పాటు కొత్త రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించినట్టు చెప్పారు. హవాయి చెప్పులు ధరించిన వ్యక్తి కూడా విమానాల్లో ప్రయాణించేలా సౌకర్యాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెప్పారని, దీన్ని సాకారం చేసే సామర్థ్యం తమకు ఉందన్నారు. రాబోయే దశాబ్దంలో మరింత సాధారణ ప్రజలకు విమాన ప్రయాణ సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం విమాన సేవలను విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని