
J&K Encounter: మరిన్ని ప్రదేశాలకు విస్తరించిన కూంబింగ్..!
ఇంటర్నెట్‌డెస్క్: జమ్ములోని పూంచ్, రాజౌరీ ఎన్‌కౌంటర్ ప్రదేశంలో జరుగుతున్న తనిఖీలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో ఎన్‌కౌంటర్ 27వ రోజుకు చేరింది. భద్రతా దళాల వైపు తొమ్మిది మంది ఇప్పటికే ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. కానీ, దళాలకు ఇప్పటి వరకు ఎటువంటి విజయం లభించలేదు. దీంతో రాజౌరీ జిల్లాలోని ఖాబ్లా అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టారు. ఇక్కడ కొందరు అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు నమ్మకమైన సమాచారం లభించడంతో దళాలు ఇక్కడ గాలింపు చేపట్టాయి.
తాన్మండి-రాజౌరీ మధ్య ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. పూంచ్ జిల్లాలో సురాన్‌కోటె, మెందహార్ అడవులు, రాజౌరీ వైపు తాన్మండి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి గాలింపు చర్యలు మొదలయ్యాయి. తొలుత ఫైరింగ్ జరిగి ఒక ఉగ్రవాది మరణించినట్లు వార్తలొచ్చినా.. సైన్యం, పోలీసుల వైపు నుంచి ఎటువంటి ధ్రువీకరణ లభించలేదు.
అక్టోబర్ 10వ తేదీన ఇద్దరు వ్యక్తులు భారీ తుపాకులతో పూంచ్‌లోని ఓ లేబర్ క్యాంప్‌కు వెళ్లారు. అక్కడ ఓ కూలీ నుంచి ఫోన్ లాక్కొని సమీపంలోని ఆర్మీ క్యాంప్ దిశగా వెళ్లినట్లు స్థానిక కూలీలు సైన్యానికి తెలియజేశారు. దీంతో ఆ ఫోన్‌పై నిఘా పెట్టిన అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ ఫోన్ పూంచ్-రాజౌరీ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్నట్లు తేలింది. ఫోన్ సంభాషణలను కూడా సైన్యం విని ఉగ్రవాదులు ఉన్న విషయాన్నిధ్రువీకరించుకొని ఆపరేషన్ మొదలుపెట్టింది.