Second Wave: ఎదురొడ్డి నిలిచిన ముంబయి..!

మునుపటి అనుభవాలు, వైరస్‌ కట్టడి వ్యూహాలు, ముందుజాగ్రత్త చర్యలతో మహమ్మారిపై ముంబయి నగరంల చేసిన పోరాటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Updated : 09 Jun 2021 16:00 IST

థర్డ్‌వేవ్‌ ఎదుర్కొనేందుకూ సన్నద్ధత

ముంబయి: ఏడాదిన్నర క్రితం దేశంలో ప్రవేశించిన కరోనా వైరస్‌ మహమ్మారి.. అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. వైరస్‌ సృష్టించిన విలయానికి పలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థ చేతులెత్తేసే దుస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలో చేరడానికి బాధితులు కొద్ది దూరానికే.. వేల రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక చివరకు ఆస్పత్రిలో చేర్పించినా.. ఆక్సిజన్‌ దొరకక బాధితులు అల్లాడిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కొవిడ్‌ ఆస్పత్రి ప్రాంగణంలో బాధిత బంధువులను ఎవరిని పలుకరించినా.. ఇలాంటి దీన గాథలే. దేశ రాజధానితో పాటు పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు వందల సంఖ్యలో కనిపించాయి. అదే సమయంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ముంబయి నగరం కరోనా పోరులో ఎదురొడ్డి నిలిచింది. మునుపటి అనుభవాలు, వైరస్‌ కట్టడి వ్యూహాలు, ముందుజాగ్రత్త చర్యలతో మహమ్మారిపై చేసిన పోరాటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

‘వైరస్‌ బారినపడిన నా భార్య ఆరోగ్యం క్షీణించింది. దీంతో దిల్లీలో ఆస్పత్రిలో చేర్పించేందుకు తిరగని చోటు లేదు. దిల్లీనే కాకుండా పలు నగరాల్లో ఐదు రోజులపాటు వెతికినా ఆసుపత్రిలో పడక లభించలేదు. కేవలం అంబులెన్స్‌కే దాదాపు రూ.72 వేలు ఖర్చుచేశాను. చివరకు ముంబయి చేరుకున్న తర్వాత మాకు ఇక్కడి ఆసుప్రతిలో చికిత్స లభించింది. ఈ నగరానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’ అని దిల్లీ శివారు ప్రాంతానికి చెందిన గౌరవ్‌ ఆవాస్తి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు ముంబయి రాకుంటే నా భార్య బతికి ఉండేదో లేదో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో కరోనా రోగులు, వారి బంధువులకు ఎదురైన ఇలాంటి బాధలు వర్ణనాతీతం.

వార్డుల్లోనే మృతదేహాలు..

కరోనా వైరస్‌ తొలి వేవ్‌ సమయంలోనూ ముంబయి తీవ్ర ప్రభావాన్ని చవిచూసింది. దీంతో బాధితులు రోడ్లమీద కుప్పకూలిపోవడం, ఆస్పత్రులకు చేరే మార్గంలోనే ప్రాణాలు విడవడం వంటి భయానక పరిస్థితులు 1918 నాటి స్పానిష్‌ ఫ్లూ విలయాన్ని గుర్తుచేసినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది సరిపోక బాధిత బంధువులే చికిత్స సమయంలో సహాయపడాల్సిన అవసరం తలెత్తింది. బాధితులు చికిత్స పొందుతున్న వార్డులోనే మృతదేహాలను ప్లాస్టిక్‌ కవర్లో చుట్టి పెట్టిన విషాద ఘటనలు కలకలం రేపాయి. ఇలాంటి సమయంలో దాదాపు 2కోట్ల జనాభా కలిగిన ముంబయిలో అక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 80 అంబులెన్సులు, దాదాపు 4 వందల ఐసీయూ పడకలు మాత్రమే ఉన్నాయి.

రంగంలోకి ఇక్బాల్‌ చాహల్‌..

ముంబయి నగరం ఇలాంటి దీన స్థితిని ఎదుర్కొంటున్న సమయంలో బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌(BMC)గా ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ బాధ్యతలు చేపట్టారు. కొవిడ్‌ రోగులకు వైద్య సదుపాయాలు, కొవిడ్‌ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా స్థానికంగా వందల సంఖ్యలో తాత్కాలిక పడకలను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. అంతేకాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లోని కొవిడ్‌ పడకలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. అత్యవసర సర్వీసుల్లో భాగంగా దాదాపు 800 అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు.

వార్‌ రూంలే కీలకం..

అయినప్పటికీ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఈ చర్యలు సరిపోలేదని ఇక్బాల్‌ చాహల్ పేర్కొన్నారు. దీంతో వ్యూహాన్ని మార్చిన ప్రభుత్వం.. ధారావితో పాటు దాదాపు 55 మురికివాడల్లో కఠిన లాక్‌డౌన్‌ అమలుచేశారు. పరిశుభ్రతను పెంచడంతోపాటు భారీ స్థాయిలో వాలంటీర్ల సహాయంతో కరోనా స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. ఇదే సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా వారికి కావాల్సిన ఆహారాన్ని అందించారు. ముంబయిలో నమోదైన ప్రతి కరోనా పాజిటివ్‌ కేసును ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన ‘వార్ రూం’ ద్వారానే పర్యవేక్షించారు. ఏ మంత్రి అయినా, ప్రముఖులైనా, లేదా మురికి వాడల్లో నివసించేవారైనా ఆ వార్‌ రూం నుంచే ఆస్పత్రిలో పడకలు పొంది చికిత్స పొందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆస్పత్రి పడకల కోసం కరోనా బాధితులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తలెత్తలేదు.

ముందుచూపు ఫలితాలు..

దేశవ్యాప్తంగా మొదటి వేవ్‌ తర్వాత వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలన్ని ఆంక్షలు సడలించాయి. ఆ సమయంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించడం స్పష్టంగా కనిపించింది. దీంతో ఒక్కసారి తుపానులా వచ్చి పడిన సెకండ్‌ వేవ్ విలయాన్ని ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు సంసిద్ధం కాలేకపోయాయి. దిల్లీ నగరంలో శ్మశానవాటికల ముందు మృతదేహాలు బారులు తీరే పరిస్థితి తలెత్తింది. కానీ, వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ముంబయిలో మాత్రం అలాంటి దాఖలాలు కనిపించలేదు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. మరణాల రేటు మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంది. గతేడాది ఏర్పాటు చేసిన కొవిడ్‌ ప్రత్యేక పడకలను ముంబయి అధికారులు తొలగించకపోవడంతో ముప్పును నగరం ఎదుర్కోగలిగింది. ఇలా ఆస్పత్రి పడకలతో పాటు బాధితులకు తోడుగా వచ్చే వారికి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారాన్ని అందించే ప్రయత్నం చేశారు.

థర్డ్‌వేవ్‌కు సన్నద్ధం

మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి అధికంగా ఉన్నప్పటికీ ముంబయిలో మాత్రం పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. ఇదే సమయంలో థర్డ్‌ వేవ్‌ విజృంభణ ఉండే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నారులపై ప్రభావం చూపిస్తుందనే అంచనాలతో థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా సిద్ధమవుతున్నామని బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ చాహల్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆస్పత్రి పడకలు, ఆక్సిజన్‌ నిల్వలు, వైద్య సిబ్బందితో ప్రభుత్వ ఆస్పత్రులను ఇందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇలా గతంలో ఎదురైన అనుభవాలు తమకు మేల్కొలుపు అని ముంబయి అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని