
Farmers' protests: రైతుల ఆందోళన: కర్నల్‌లో సెక్షన్ 144.. ఇంటర్నెట్ బంద్!
కర్నల్ (హరియాణా): కర్నల్‌లో గత నెల కర్షకులపై జరిగిన లాఠీఛార్జిని నిరసిస్తూ రైతులు మంగళవారం నిరసన కార్యక్రమం తలపెట్టారు. దీంతో కర్నల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా సెక్షన్ 144 విధించింది. దీంతోపాటు ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. జాతీయ రహదారిపై ప్రయాణ ఆంక్షలు విధించింది.
భాజపా సమావేశాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన రైతులపై గత నెల 28న పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన రైతు ఒకరు తర్వాత మరణించారు. అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.25 లక్షలు ఇవ్వాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అలాగే రైతుల ‘తలలు పగలగొట్టండి’ అంటూ పిలుపునిచ్చిన ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కర్నల్‌లో మినీ సచివాలయం వద్ద ఘొరావ్‌కు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో కర్నల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 12.30 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ఆ జిల్లా అధికారులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు సెక్షన్ 144 విధిస్తున్నట్లు చెప్పారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై (అంబాలా-దిల్లీ) ప్రయాణ ఆంక్షలు విధించారు. కర్నల్ మీదుగా వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.