Pathankot: పఠాన్‌ కోట్‌లో హైఅలర్ట్‌.. గ్రామాల్లో సంచరిస్తున్న సాయుధ ఉగ్రవాదులు

వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్‌కోట్‌లో మరోసారి సాయుధ ఉగ్ర సంచారాన్ని గుర్తించడంతో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి. ఈ జిల్లాలో హైఅలర్ట్‌ ప్రకటించాయి. 

Published : 26 Jun 2024 14:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్‌ కోట్‌ (Pathankot) జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో బుధవారం జిల్లాలో హైఅలర్ట్‌ ప్రకటించారు. పలు గ్రామాల్లో దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బోర్డర్‌ రేంజి డీఐజీ రాకేశ్‌ కుశాల్‌ మాట్లాడుతూ గత రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టినట్లు తెలిపారు. ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌, సహా అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలకు అలర్ట్‌లు జారీ చేశామన్నారు.

పఠాన్‌కోట్‌ ఎస్‌ఎస్‌పీ సుహైల్‌ ఖాసీం మిర్‌ ఈ వివరాలను వెల్లడిస్తూ.. ‘‘ఇద్దరు సాయుధులు కోట్‌ భట్టియాన్‌ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించాం. ఈ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాతో సరిహద్దులు పంచుకొంటోంది. ఈ అనుమానితులే కథువాలోని కోట్‌ పన్నూలో కూడా సంచరించినట్లు తెలిసింది’’ అని వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన పాక్‌ నుంచి కథువా జిల్లా సుక్‌పాల్‌ గ్రామంలోకి చొరబడిన ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు కాల్చిచంపాయి.

గతంలో వాయుసేన స్థావరంపై దాడి..

2016 జనవరిలో పఠాన్‌కోట్‌లోని వాయుసేన స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అప్పట్లో కూడా వారు తొలుత వీధుల్లో తిరుగుతూ వాహనాలను హైజాక్‌ చేసి ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడే భారీగా పెరిగిన గడ్డిలో నక్కారు. తెల్లవారుజామున సిబ్బంది క్వార్టర్స్‌లోకి ప్రవేశించి దాడి చేసి పలువురి ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. వీరిని పూర్తిస్థాయిలో మట్టుబెట్టడానికి కొన్ని రోజులు వాయుసేన, ఇతర భద్రతా దళాలు శ్రమించాల్సి వచ్చింది. నాడు ఎయిర్‌ఫోర్స్‌ కీలక ఆయుధ సంపత్తికి ఎటువంటి నష్టం జరగకపోవడమే పెద్ద ఊరట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు