UP: మథురలో కట్టుదిట్టమైన భద్రత

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నిన నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను

Published : 12 Jul 2021 23:33 IST

మథుర: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నిన నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన అనంతరం లఖ్‌నవూ సహా పలు నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.  అందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం మథురలో భద్రతను పెంచినట్టు పోలీసులు సోమవారం తెలిపారు.  మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానం, బృందావనంలోని ఠాకుర్‌ బంకె బిహారి దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా  తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎస్‌ఎస్‌పీ గౌరవ్‌ గ్రోవర్‌ వెల్లడించారు. ఠాకుర్‌ బంకె బిహారి దేవాలయం వద్ద భద్రతా ఏర్పాట్లను జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌జీ)కి చెందిన బృందం పర్యవేక్షించిందని చెప్పారు.  చమురు శుద్ధి కర్మాగారాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్‌ వే, ఆగ్రా-దిల్లీ జాతీయ రహదారి సహా బృందావనం, గోవర్థన్‌, బర్సానా లాంటి పట్టణాల్లో ప్రజల కదలికలపై ప్రత్యేక పోలీసు బృందాలు నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.

అల్‌ఖైదా అనుబంధ ఉగ్రముఠా అన్సర్‌ ఘజ్వతుల్‌ హింద్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను యూపీ ఏటీఎస్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్రంలోని లఖ్‌నవూ, మథుర, వారణాసి, అయోధ్య సహా పలు కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని