Mumbai: సేన Vs సేన.. హోరా హోరీగా దసరా ర్యాలీలు..?

దాదాపు 56 ఏళ్ల తర్వాత తొలిసారిగా శివసేన బుధవారం రెండు దసరా ర్యాలీలను నిర్వహించనుంది. అందులో ఒకటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం నిర్వహిస్తుండగా.. రెండోది ఉద్ధవ్‌ ఠాక్రే వర్గీయులు నిర్వహిస్తున్నారు.......

Published : 05 Oct 2022 01:57 IST

ముంబయి: దాదాపు 56 ఏళ్ల తర్వాత తొలిసారిగా శివసేన బుధవారం రెండు దసరా ర్యాలీలను నిర్వహించనుంది. అందులో ఒకటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం నిర్వహిస్తుండగా.. రెండోది ఉద్ధవ్‌ ఠాక్రే వర్గీయులు నిర్వహిస్తున్నారు. ర్యాలీల వేదికగా ఈ రెండు వర్గాలు తమ బలాలను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకే పార్టీలోని రెండు వర్గాలు నిర్వహిస్తున్న ఈ ర్యాలీలు అటు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం దాదర్‌లోని చారిత్రక శివాజీ పార్కు నుంచి ప్రదర్శనను ప్రారంభించనుంది. ఇక్కడి నుంచి ర్యాలీని ప్రారంభించడం 1966ను శివసేనకు ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంతి శిందే వర్గం బాంద్రాకుర్లాలోని ఎంఎంఆర్డీయే మైదానం నుంచి ర్యాలీని ప్రారంభించనుంది. ఇది ఠాక్రే కుటుంబ నివాసం ‘మాతోశ్రీ’కి సమీపంలో ఉండటం గమనార్హం. ఇరువర్గాలు కూడా శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే చిత్రపటాలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమ ర్యాలీలను సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు ఇటు ఉద్ధవ్‌, అటు శిందే వర్గాలు ముమ్మర ఏర్పాట్లు చేశాయి. సమావేశాలు ఏర్పాటు చేయదలచుకున్న ప్రాంతాలను కాషాయ జెండాలతో నింపేశాయి.

శివాజీ పార్కులో ఏర్పాటు చేసే ర్యాలీలో ముఖ్యమంత్రి శిందే వర్గంతోపాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శలు గుప్పించే అవకాశముంది. మరోవైపు, ముఖ్యమంత్రి శిందే కూడా ఠాక్రే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించే అవకాశముంది. ఎంఎంఆర్‌డీఏ మైదానంలో జరిగే సమావేశానికి 3.5 నుంచి 4 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా. ఇరువర్గాలూ కేవలం ముంబయి నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని