Published : 10 Feb 2021 09:22 IST

ట్రంప్‌పై అభిశంసనకు అంగీకరించిన సెనేట్‌

ప్రారంభమైన విచారణ

 

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సెనేట్‌లో ప్రవేశపెట్టిన అభిశంసనపై మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను ఆపేందుకు ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్‌ సెనేటర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పదవిలో లేని అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం పెట్టలేమంటూ వారు చేసిన వాదన ఓటింగ్‌లో వీగి పోయింది. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు డెమొక్రాట్లకు మద్దతు పలకడం గమనార్హం. అమెరికా చరిత్రలో ఓ అధ్యక్షుడు రెండోసారి అభిశంసనను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. అలాగే పదవి నుంచి దిగిపోయిన తర్వాత అభిశంసనను ఎదుర్కోవడం కూడా ఇదే తొలిసారి.

క్యాపిటల్‌ హిల్‌ భవనంపై జరిపిన దాడికి సంబంధించిన వీడియోలు, అంతకుముందు ఆందోళనకారులకు ట్రంప్‌ చేసిన పలు వినతులను సభలో చూపించడంతో విచారణ ప్రారంభమైంది. ఈ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించాలంటే సెనేట్‌లో మూడొంతుల మంది మద్దతు తప్పనిసరి. ఇది సాధ్యమయ్యే అవకాశాలు లేవు. అయినప్పటికీ.. అధ్యక్షుడిగా ట్రంప్‌ చేసిన తప్పిదాలను నిరూపించేందుకు దీన్ని డెమొక్రాట్లు ఓ సాధనంగా వాడుకుంటున్నారు. అలాగే, క్యాపిటల్‌ భవనంపై దాడికి కారణమైన ఓ వ్యక్తికి రిపబ్లికన్‌ సెనేటర్లు మద్దతు పలుకుతున్నారని దేశ ప్రజలకు తెలియజేయడానికి దీన్ని డెమొక్రాట్లు ఓ మార్గంగా భావిస్తున్నారు. మరోవైపు క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడిని ఖండిస్తూనే.. దానికి ట్రంప్‌ వ్యాఖ్యలు కారణం కాదని సెనేట్‌ సభ్యులు వాదించారు. ఇక విచారణ సందర్భంగా క్యాపిటల్‌ భవనం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

డాడీ  క్యాపిటల్‌కు ఇంకెప్పుడూ రాను..!

విచారణ సందర్భంగా డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన జేమీ రస్కిన్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. బైడెన్‌ ఎన్నిక ధ్రువీకరణ ఘట్టాన్ని చూపించేందుకు ఆరోజు తన కుటుంబ సభ్యులతో సభకు వచ్చానని తెలిపారు. ‘‘ఘటనా సమయంలో నా కూతురు, అల్లుడు క్యాపిటల్‌ భవనంలోని ఓ కార్యాలయంలో టేబుల్‌ కింద దాక్కున్నారు. ప్రాణాలపై ఆశలు కోల్పోయారు. టెక్ట్స్ మెసేజ్‌లు పంపారు. అవే వారి చివరి మాటలనుకున్నారు. వాతావరణం చల్లబడిన తర్వాత వారిని కలుసుకున్నాను. క్షమాపణలు కోరాను. మరోసారి శాంతియుత వాతావరణంలో తీసుకొస్తానని హామీ ఇచ్చాను. కానీ, ఇంకెప్పుడు క్యాపిటల్‌కు రాబోనని నా కూతురు అన్న మాటలు నన్ను తీవ్రంగా కలచివేశాయి’’ అంటూ రస్కిన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతటి దారుణమైన ఘటనలకు మినహాయింపునిచ్చామన్న అపవాదు సెనేట్‌కు రావొద్దని కోరారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం నెగ్గాల్సిందేనని వాదించారు.

ఇవీ చదవండి...

ఆజాద్‌కు వీడ్కోలు.. మోదీ కంటతడి

ఆ పరికరంపైనే ‘అణు’మానాలు

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts