Gauhati HC: ‘జీన్స్‌’తో కోర్టు విచారణకు.. సీనియర్‌ న్యాయవాదికి ఊహించని అనుభవం!

ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు జీన్స్‌ ధరించి వచ్చిన న్యాయవాదిపై గువాహటి హైకోర్టు చర్యలు తీసుకుంది. ఆయన్ను హైకోర్టు ప్రాంగణం నుంచి బయటకు పంపించివేయాలని పోలీసులను ఆదేశించింది.

Published : 28 Jan 2023 21:47 IST

దిస్పుర్‌: అస్సాంలోని గువాహటి హైకోర్టు(Gauhati High Court)లో ఓ సీనియర్‌ న్యాయవాదికి ఊహించని అనుభవం ఎదురైంది. జీన్స్(Jeans) ధరించి ఓ కేసు విచారణకు హాజరైనందుకుగానూ న్యాయమూర్తి ఆయన్ను కోర్టునుంచి బయటకు పంపించేశారు. గువాహటి హైకోర్టు ముందుకు తాజాగా ఓ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే పిటిషనర్‌ తరఫు న్యాయవాది బీకే మహాజన్‌ జీన్స్‌తో తన వాదనలు వినిపించేందుకు ముందుకొచ్చారు. ఇది గమనించిన జస్టిస్‌ కల్యాణ్‌ రాయ్‌ సురానా ఆధ్వర్యంలోని ధర్మాసనం వెంటనే పోలీసులను పిలిచింది. ఆయన్ను కోర్టునుంచి బయటకు పంపించేయాలని(Decourt) ఆదేశించింది.

‘బీకే మహాజన్ జీన్స్ ప్యాంట్‌లో ఉన్నారు. అందువల్ల ఆయన్ను హైకోర్టు ప్రాంగణం బయటకు పంపించేందుకు పోలీసు సిబ్బందిని పిలవాల్సి వచ్చింది. దీంతో నేటి విచారణ వాయిదాపడింది’ అని జస్టిస్‌ సురానా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి, రిజిస్ట్రార్ జనరల్‌తోపాటు అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లోని బార్ కౌన్సిళ్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ క్రమంలోనే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వారం తర్వాత కోర్టు ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని