ఐసీయూలో భార్య మృతదేహం చెంతే.. కాల్చుకొని ఐపీఎస్‌ బలవన్మరణం

భార్య మరణవార్త ఓ ఐపీఎస్ అధికారిని తీవ్రంగా బాధించింది. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేని ఆయన.. ఆసుపత్రిలో ఆమెమృతదేహం వద్దే కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. 

Published : 19 Jun 2024 11:50 IST

దిల్లీ: భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మృతదేహం ఉన్న ఐసీయూలోనే తుపాకీతో కాల్చుకొని ఒక ఐపీఎస్ ప్రాణాలు తీసుకున్నాడు. అస్సాం (Assam)లోని గువహటికి చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

శిలాదిత్య చెతియా (Siladitya Chetia).. అస్సాం హోంశాఖ కార్యదర్శిగా పనిచేసేవారు. ఆయన 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన భార్య కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గువాహటిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు నాలుగు నెలలుగా చెతియా సెలవులోనే ఉన్నారు. అయితే నిన్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఈ విషయం తెలిసిన వెంటనే చెతియా ఐసీయూ వద్దకు వచ్చారు. ఆమెవద్ద కొద్దిసేపు ఒంటరిగా ఉంటానని చెప్పి, అక్కడున్న వైద్యసిబ్బందిని బయటకు వెళ్లమని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మాకు తుపాకీ శబ్దాలు వినిపించాయి. వెళ్లిచూడగా.. ఆయన తన తుపాకీతో కాల్చుకున్నారు. మేం ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడటంతో చనిపోయారు’’ అని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ‘‘భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పటి నుంచి ఆయన ఆందోళనగా కనిపించేవారు. ఆమెవద్దే ఉండి బాగోగులు చూసుకునేవారు. ఇప్పుడు ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది’’ అని వెల్లడించారు. తీన్‌సుకియా, సోనిత్‌పుర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన శిలాదిత్య.. అస్సాం పోలీసు విభాగానికి చెందిన ఫోర్త్‌ బెటాలియన్‌కు కమాండెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత  హోంశాఖ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని