Farm Laws: ఓటమిని గ్రహించే సాగు చట్టాల రద్దు.. కేంద్రంపై ప్రియాంక విమర్శలు

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నప్పటికీ.. ఎన్నికల వేళ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర

Updated : 19 Nov 2021 15:04 IST

దిల్లీ: నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నప్పటికీ.. ఎన్నికల వేళ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోతారనే కేంద్రం సాగు చట్టాలపై వెనక్కి తగ్గిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దుయ్యబట్టారు. సాగు చట్టాల రద్దుపై నేడు మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రధానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

‘‘నరేంద్ర మోదీజీ.. 350 రోజులకు పైగా పోరాటం.. వేలాది మంది రైతుల త్యాగం.. మీ మంత్రి కొడుకు రైతులను వాహనంతో తొక్కి చంపారు. అయినా మీరు పట్టించుకోలేదు. మీ పార్టీ నేతలు రైతులను ఉగ్రవాదులన్నారు. మీరే స్వయంగా వాళ్లని ‘ఆందోళనజీవి’ అని సంబోధించారు. కర్రలతో కొట్టారు. అరెస్టులు చేశారు. ఇవన్నీ జరుగుతున్నా మీరు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి.. ఒక్కసారిగా వాస్తవాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. చట్టాలను రద్దు చేశారు. ఇదంతా ఎందుకు? ఎన్నికలు వస్తున్నాయి.. పరిస్థితులు సరిగా లేవనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న విషయం దేశ ప్రజలకు అర్థం కాదంటారా..! రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ప్రతికూల ఫలితాలు రావొచ్చని సర్వేల ద్వారా వారు (కేంద్రం) తెలుసుకుంది. అందుకే ఎన్నికల ముందు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నారు. మీ ఉద్దేశాలు.. మీ ప్రవర్తనను నమ్మడం చాలా కష్టం’’ అంటూ ప్రియాంక ధ్వజమెత్తారు. 

ఎన్నికల భయంతోనే..: చిదంబరం

అటు కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సాగు చట్టాల రద్దు రైతుల విజయంగా అభివర్ణించిన ఆయన.. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని దుయ్యబట్టారు. ‘‘ప్రజాస్వామ్యయుత ఆందోళనలతో సాధ్యం కానిది.. ఎన్నికల భయంతో సాధ్యమైంది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని చేసిన ప్రకటన.. మనసు మార్చుకునో లేదో విధానాలు మార్చుకునో తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నికల భయంతో జరిగిన మార్పు ఇది. ఏదేమైనప్పటికీ.. ఇది అన్నదాతల విజయం’’ అని చిదంబరం ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు