India Summons UK Official: లండన్‌లో ఖలిస్థాన్‌ అనుకూలవాదుల దుశ్చర్య.. బ్రిటన్‌ దౌత్యవేత్తకు సమన్లు

లండన్‌లో భారత్‌ దౌత్య కార్యాలయంపై ఎగురవేసిన జెండాను ఖలిస్థాన్‌ అనుకూలవాదులు అగౌరవపరచడంపై భారత్‌ మండిపడింది.ఈ మేరకు దిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

Published : 20 Mar 2023 04:57 IST

దిల్లీ: ఖలిస్థాన్‌ అనుకూలవాదులు లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను కిందికి దింపేసి అగౌరవ పరచడంపై భారత్‌ మండిపడింది. ఈ మేరకు దిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. లండన్‌లో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. బాధ్యులపై వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేసింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేయడంపై రెండు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం ఇవాళ సాయంత్రం నుంచి లండన్‌లో నిరసనలు ప్రారంభించింది. లండన్‌లోని భారత హై కమిషన్‌ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ.. నిరసనకారులు భారత హైకమిషన్‌కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై కూలంకషంగా వివరణ ఇవ్వాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం భారత హైకమిషన్‌కు భద్రత కల్పించడం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత భారత విదేశాంగశాఖ గుర్తు చేసింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని