Adar Poonawalla: అదర్‌ పూనావాలా పేరుతో మెసేజ్‌.. సీరమ్‌ సంస్థ నుంచి రూ.కోటి కొట్టేసి..!

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాతో సామాన్యుల దగ్గర్నుంచి ప్రముఖుల్ని సైతం మోసం చేస్తూ కోట్ల

Published : 10 Sep 2022 17:21 IST

పుణె: సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాతో సామాన్యుల దగ్గర్నుంచి ప్రముఖుల్ని సైతం మోసం చేస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఈ మోసగాళ్ల బారిన పడింది. ఆ సంస్థ ఈ సీఈఓ అదర్‌ పూనావాలా పేరుతో సైబర్‌ నేరగాళ్లు నకిలీ మెసేజ్‌ పంపించి రూ.కోటికి పైనే కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సీరమ్‌ కంపెనీ డైరెక్టర్‌ సతీశ్‌ దేశ్‌పాండేకు సెప్టెంబరు 7న సీఈఓ అదర్‌ పూనావాలా నంబరు నుంచి వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చింది. కొన్ని బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపమని ఆ సందేశం సారాంశం. దీంతో సెప్టెంబరు 7వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సెప్టెంబరు 8వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల మధ్య సతీశ్.. ఆ బ్యాంకు ఖాతాలకు రూ.1,01,01,554 బదిలీ చేశారు. 

అయితే, డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయమని అదర్‌ పూనావాలా ఎలాంటి మెసేజ్‌ చేయలేదని ఆ తర్వాత కంపెనీ సిబ్బందికి తెలిసింది. దీంతో సంస్థ ఫైనాన్స్‌ మేనేజర్‌ సాగర్‌ కిట్టూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాట్సాప్‌లో ఆ మెసేజ్‌ ఎవరు పంపారు..? ఎవరి ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందన్న వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భారత ప్రముఖ ఫార్మా సంస్థల్లో ఒకటైన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారుగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనా సమయంలో ఈ సంస్థ కొవిషీల్డ్‌ టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు కరోనా వేరియంట్ల వ్యాప్తిని అరికట్టేందుకు మరిన్ని టీకాలను కూడా తయారుచేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని