Vaccine: చిన్నారులపై కొవావాక్స్‌ ప్రయోగాలు..!

కరోనా మహమ్మారి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేలా వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌ బయోటెక్ పిల్లలపై ‘కొవాగ్జిన్‌’ క్లినికల్‌ ప్రయోగాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

Updated : 26 Jun 2021 14:14 IST

అనుమతులు కోరనున్న సీరమ్‌ సంస్థ

పుణె: కరోనా మహమ్మారి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేలా వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌ బయోటెక్ పిల్లలపై ‘కొవాగ్జిన్‌’ క్లినికల్‌ ప్రయోగాలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిన్నారులపై ‘కొవావాక్స్‌’ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకోనుంది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను భారత్‌లో ‘కొవావాక్స్‌’ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను మన దేశంలో ప్రారంభించగా, శుక్రవారం నుంచి కొవావాక్స్‌ ఉత్పత్తిని కూడా మొదలుపెట్టినట్లు సీరమ్‌ అధినేత అదర్‌ పూనావాలా వెల్లడించారు. అమెరికాలో నొవావాక్స్‌కు అనుమతులు లభించిన తర్వాతనే భారత్‌లోనూ వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. 

ప్రస్తుతం దేశంలో మూడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్నారుల కోసం ఏ టీకాకు ఇంతవరకూ అనుమతులు లభించలేదు. భారత్‌ బయోటెక్‌ మాత్రం చిన్నారులపై కొవాగ్జిన్‌ టీకా ప్రయోగాలు జరుపుతోంది. ప్రస్తుతం అవి తుదిదశలో ఉన్నాయి. సెప్టెంబరు - అక్టోబరు నాటికి పిల్లలకు కూడా టీకాలు అందుబాటులోకి రావచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని