Modi: వైద్యులే మనల్ని కాపాడుతున్న దేవుళ్లు

వైద్యులు ఆ భగవంతుడి ప్రతిరూపాలను, మన ప్రాణాలను కాపాడుతున్న దేవుళ్లని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా భారత

Published : 01 Jul 2021 17:24 IST

వైద్య సిబ్బందిపై ప్రధాని ప్రశంసలు

దిల్లీ: వైద్యులు ఆ భగవంతుడి ప్రతిరూపాలని, మన ప్రాణాలను కాపాడుతున్న దేవుళ్లని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా భారత వైద్య మండలి(ఐఎంఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని వర్చువల్‌గా ప్రసంగించారు. కరోనా మహమ్మారి విపత్తు వేళ విశేష సేవలందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

‘‘కరోనా మహమ్మారితో యావత్ దేశం పోరాడుతున్న వేళ వైద్యులు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ పోరాటంలో కొంతమంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశ ప్రజల కోసం గొప్ప త్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తున్నా. 130కోట్ల మంది భారత ప్రజల తరఫున ప్రతి వైద్యుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని మోదీ తెలిపారు. 

స్వాతంత్ర్యం తర్వాత కొన్ని దశాబ్దాల పాటు వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైందని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆరోగ్య, మౌలిక సౌకర్యాల కల్పనకు తోడ్పాటు అందించామని తెలిపారు. కరోనా తొలి దశ సమయంలో దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ. 15వేల కోట్ల మేర ప్రత్యేక నిధులను కేటాయించినట్లు ప్రధాని చెప్పారు. ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు రెట్టింపు చేశామని, రూ. 50వేల కోట్లతో రుణహామీ పథకం ప్రకటించినట్లు గుర్తుచేశారు.

‘‘ఈ రోజు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల సంఖ్య పెరిగింది. కొత్తగా ఎయిమ్స్‌లు, మెడికల్‌ కళాశాలల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటి వల్ల మారుమూల ప్రాంతాల్లోని వారు డాక్టర్లు కావాలన్న తమ కలను నిజం చేసుకోగలుగుతున్నారు’’ అని వెల్లడించారు. వైద్యులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. కొన్ని సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే వైద్య రంగంలో భారత్‌ మెరుగ్గానే ఉందని ప్రధాని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని