బదిలీ చేయగానే అదృశ్యం.. ఐఏఎస్‌ అధికారికి దిల్లీ సర్కారు నోటీసులు..!

దిల్లీ (Delhi) ప్రభుత్వంలోని సేవల విభాగం కార్యదర్శి ఆశిష్‌ మోరెను కేజ్రీవాల్‌ సర్కారు ఇటీవల బదిలీ చేసింది. అయితే ఈ బదిలీని కేంద్రం అమలు చేయలేదు. మరోవైపు అప్పటి నుంచి కన్పించకుండా పోయారు. దీంతో ఆయనకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Published : 15 May 2023 16:18 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi) సర్కారులోని సేవల విభాగం కార్యదర్శి ఆశిష్‌ మోరె (Ashish More)ను పదవి నుంచి తప్పించడంతో దిల్లీ, కేంద్రం మధ్య మరోసారి వివాదం రాజుకుంది. దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే పాలనపై నియంత్రణ ఉండాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆశిష్‌పై కేజ్రీవాల్ (Kejriwal) సర్కారు బదిలీ వేటు వేసింది. అయితే ఈ బదిలీని కేంద్రం అమలు చేయకపోవడాన్ని ఆప్‌ సర్కారు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే బదిలీ వేటుకు గురైన ఆశిష్‌.. కన్పించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ వస్తోంది. దీంతో దిల్లీ ప్రభుత్వం ఆయనకు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే (Delhi Govt) నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు గత గురువారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే.. దిల్లీ ప్రభుత్వంలోని సర్వీసెస్‌ విభాగం కార్యదర్శి (services secretary) ఆశిష్‌ మోరె (Ashish More)ను కేజ్రీవాల్‌ సర్కారు ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో దిల్లీ జల్‌ బోర్డు మాజీ సీఈవో ఎ.కె.సింగ్‌ను నియమించింది. అయితే ఆ తర్వాత నుంచి ఆశిష్‌ అదృశ్యమయ్యారు. నూతన అధికారి నియామకానికి సంబంధించిన ఫైల్‌ను సమర్పించాలని సర్వీసెస్‌ శాఖా మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌.. గత గురువారం ఆశిష్‌కు సూచించారు. కానీ, అప్పటికే ఆయన ఎవరికీ చెప్పకుండా సెక్రటేరియట్‌ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ కన్పించట్లేదు. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసినట్లు సౌరభ్‌ భరద్వాజ్‌ కార్యాలయం వెల్లడించింది.

బదిలీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఆశిష్‌ మోరె (Ashish More) ఇంటికి పంపగా ఎలాంటి స్పందన రాలేదు. వాట్సప్‌, ఈ-మెయిల్‌కు పంపించినా ఆశిష్‌ నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆయన ‘పారిపోయాడని’ ఆరోపించిన దిల్లీ ప్రభుత్వం తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా తన స్పందన తెలియజేయాలని ఆదేశించింది. లేదంటే ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారిని హెచ్చరించింది.

కాగా.. ఈ బదిలీ వ్యవహారంపై ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను కేంద్రం ధిక్కరిస్తోందని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌.. ఈ కేసులో వాదనలు వినేందుకు వచ్చేవారం ధర్మాసనం ఏర్పాటు చేస్తామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని