Surat: సూరత్‌లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. సూరత్‌లోని పాల్‌ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది.

Updated : 07 Jul 2024 10:23 IST

సూరత్‌: గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. సూరత్‌లోని పాల్‌ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. శిథిలాల్లో చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి. 2016లో నిర్మించిన భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, ఏడు మృతదేహాలను బయటకు తీశామని చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఝార్ఖండ్‌లో మరో ఘటన

ఝార్ఖండ్‌లోని డియోఘర్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు పిల్లలు, ఓ మహిళను రక్షించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ విశాల్‌ సాగర్‌ తెలిపారు. 

గొడ్డ నియోజక వర్గ ఎంపీ దూబే మాట్లాడుతూ ‘‘ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో డియోఘర్‌లోని బంబం ఝా పాత్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే  స్పందించి ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపారు. ఇప్పటి వరకు శిథిలాల నుంచి ముగ్గురిని రక్షించారు. గాయపడిన వారిని దియోఘర్ AIIMSకు తరలించి చికిత్స అందిస్తున్నాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని