Published : 29 Apr 2022 16:46 IST

Coal Shortage: దేశంలో బొగ్గు కొరత.. 42 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

దిల్లీ: దేశంలో బొగ్గు సంక్షోభం నానాటికీ తీవ్రతరమవుతోంది. పలు రాష్ట్రాల్లోన్ని విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. దీంతో కరెంట్ కోతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తోంది.

బొగ్గు రవాణాను పెంచేందుకు నేడు 42 ప్యాసింజర్‌ రైళ్లను నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు. మరోవైపు వచ్చే నెల రోజుల్లో మరిన్ని ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకు 650కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు మెయిల్‌, కమ్యూటర్‌ ట్రైన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. రైళ్ల రద్దు తాత్కాలికమేనని, బొగ్గు సరఫరా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే బొగ్గు కొరత కారణంగా డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అనేక చోట్ల కరెంట్ కోతలు వేధిస్తున్నాయి. దేశీయ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఏప్రిల్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు 17శాతం బొగ్గు నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది.

పవర్‌ ప్లాంట్ల వద్ద కనీసం 21 రోజులకు బొగ్గు నిల్వలు ఉండాలని, అయితే ప్రస్తుతం చాలా చోట్ల ఒక రోజుకు మించి సరిపడా నిల్వలు లేవని దిల్లీ విద్యుత్‌ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దిల్లీలో ఆసుపత్రులు, మెట్రోలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని కేంద్రాన్ని హెచ్చరించారు. వీలైనంత త్వరగా బొగ్గు సరఫరాను పెంచాలని కోరారు. దిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గి కరెంట్‌ కోతలు మొదలయ్యాయి. గతేడాది కూడా ఇలాంటి బొగ్గు సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని