పండగ వేళ విషాదం: ఆలయంలో మెట్లబావిలో పడి 13మంది భక్తులు మృతి

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి పలువురు భక్తులు అందులో చిక్కుకుపోయారు.

Updated : 30 Mar 2023 22:39 IST

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో శ్రీరామ నవమి వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి (Stepwell) పైకప్పుకూలి.. అందులో భక్తులు పడిపోయారు. ఇందౌర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది భక్తులు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుల్లో 10మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున  చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. 

పటేల్‌నగర్‌ ప్రాంతంలోని మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి (well) పైనున్న ఫ్లోరింగ్‌పై కూర్చున్నారు. అయితే, ఆ బరువును ఆపలేక ఫ్లోరింగ్‌ కుంగి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో కొందరు భక్తులను బయటకు తీసుకొచ్చారు.  ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరింది. మరోవైపు, ఘటనా స్థలాన్ని కలెక్టర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ ప్రమాదంలో 17మందిని కాపాడారు. వీరిలో అనేకమందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ బావి లోతు 50 అడుగుల పైనే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధాని దిగ్భ్రాంతి..

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు ఫోన్‌ చేసిన అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. అటు సీఎం చౌహన్‌ కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, సహాయకచర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు