Haryana: విరిగినపడిన కొండచరియలు.. శిథిలాల కింద చిక్కుకున్న 20 మంది..!

హరియాణాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భివానీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 15-20 మంది గల్లంతయ్యారు. దాడమ్‌ మైనింగ్‌ జోన్‌లో క్వారీ పనులు

Updated : 01 Jan 2022 15:16 IST

చండీగఢ్‌: హరియాణాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భివానీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 15-20 మంది గల్లంతైనట్లు సమాచారం. దాడమ్‌ మైనింగ్‌ జోన్‌లో క్వారీ పనులు చేస్తుండగా ఓ కొండకు పగుళ్లు ఏర్పడి పెద్ద పెద్ద బండరాళ్లు  విరిగిపడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు కొండచరియల కింద చిక్కుకుపోయారు.

సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురిని కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాల కింద మరో 15 నుంచి 20 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా క్వారీ వద్ద పదుల సంఖ్యలో క్రేన్లు, డంపరు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘దాడమ్‌ మైనింగ్‌ జోన్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన దురదృష్టకరం. ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించాను’’ అని సీఎం ట్వీట్‌ చేశారు. ప్రమాద స్థలాన్ని రాష్ట్ర మంత్రి జేపీ దలాల్‌ పరిశీలించారు. ప్రమాదంలో పలువురు చనిపోయారని, అయితే ఎంతమంది అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని