‘అతడి తల ఫుట్‌బాల్‌లా వచ్చి నా ఛాతీపై పడింది’.. షాక్‌లో అస్సాం యువకుడు!

కోరమాండల్‌ బోగీలో (Coromandel Express) ప్రయాణిస్తున్న అస్సాంకు చెందిన యువకుడు ప్రమాదం జరిగిన వెంటనే బయటకు వచ్చేశాడు. అనంతరం దాన్ని మరో రైలు ఢీకొట్టడంతో అందులో ఉన్న మరో వ్యక్తి తల తెగి తనపై పడటంతో షాక్‌కు గురయ్యాడు.

Published : 07 Jun 2023 01:31 IST

గువహాటి: బాలేశ్వర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదానికి (Odisha rail accident) సంబంధించి ఒక్కో దీనగాథ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో కళ్లముందే జరిగిన ఘోర ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఓ అస్సాం యువకుడు.. జూన్ 2 నుంచి ఆహారం తినడమే మానేశాడట. కోరమాండల్‌ బోగీలో (Coromandel Express) నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన వెంటనే.. అదే బోగీలో ఉన్న ఓ ప్రయాణికుడి తల తెగి ఫుట్‌బాల్‌లా ఎగిరి తనపై పడిందని వాపోయాడు. ఆ ఘటనతో షాక్‌కు గురైన ఆ యువకుడు ఇంకా తేరుకోలేదని వైద్యులు వెల్లడించారు.

‘ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. మా రైలు పట్టాలు తప్పిందని అనుకున్నా. కిటికీ నుంచి బయటకు చూడగానే.. మా రైలు ఇంజిన్‌ గూడ్స్‌ రైలు మీద ఉండటాన్ని చూశా. వెంటనే అత్యవసర గ్లాసును పగలగొట్టి బోగీ బయటకు వచ్చేశా. మరో ఇద్దరు నాతోపాటే బయటకు వచ్చేశారు. మరికొన్ని క్షణాల్లోనే బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ వచ్చి మా రైలును బలంగా ఢీకొట్టింది. దాంతో మా బోగీ మొత్తం నుజ్జునుజ్జయ్యింది. దాంతో అందులోని ఓ వ్యక్తి తల తెగిపోయి ఆ ఎమర్జెన్సీ కిటికీ నుంచి ఫుట్‌బాల్‌లా తిరుక్కుంటూ వచ్చి నా ఛాతీపై పడిపోయింది’ అని అస్సాం యువకుడు వెల్లడించాడు. ప్రస్తుతం గువహాటి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాస్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కానీ, రైలు ప్రమాదంతో షాక్‌నుంచి ఇంకా తేరుకోలేదని.. అతడికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని చెప్పారు.

అస్సాంలోని సోనిత్‌పుర్‌ జిల్లాకు చెందిన రూపక్‌ దాస్‌.. పుదుచ్చేరిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గర్భిణీ అయిన తన భార్యను స్వస్థలంలో విడిచిపెట్టి.. తిరిగి పుదుచ్చేరికి బయలుదేరాడు. అయితే, అతడు వెళ్లాల్సిన రైలు అందకపోవడంతో హావ్‌డా-చెన్నై కోరమాండల్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అనంతరం అతడు ప్రయాణిస్తోన్న రైలు ఘోర ప్రమాదానికి గురైనప్పటికీ.. దాస్‌ మాత్రం గాయాలతో బయటపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని