Shah Rukh Khan: ఆర్యన్‌ సరిగా తింటున్నావా నాన్నా.. జైల్లో షారుక్‌ భావోద్వేగం

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ దాదాపు మూడు వారాల తర్వాత తన తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను నేరుగా కలుసుకున్నారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ ప్రస్తుతం

Published : 22 Oct 2021 01:38 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ దాదాపు మూడు వారాల తర్వాత తన తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను నేరుగా కలుసుకున్నారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ ప్రస్తుతం ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం అతడికి బెయిల్ లభిస్తుందని షారుక్‌ కుటుంబం ఆశించినప్పటికీ కోర్టు అందుకు తిరస్కరించింది. దీంతో గురువారం ఉదయం షారుక్‌ జైలుకెళ్లి తన కుమారుడిని కలిశారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులిద్దరూ భావోద్వేగానికి గురైనట్లు జైలు సిబ్బంది వర్గాలు వెల్లడించాయి.

గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో షారుక్‌ ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వచ్చారు. ఆయన ఆధార్‌ కార్డు ఇతర పత్రాలను పరిశీలించిన అనంతరం అధికారులు ఒక టోకెన్‌ ఇచ్చారు. ఆ టోకెన్‌ తీసుకుని షారుక్‌ జనరల్‌ సెల్‌కు వెళ్లి ఆర్యన్‌ను కలిశాడు. వీరి మధ్య గ్రిల్‌, గాజు గోడ అడ్డుగా ఉంది. ఇంటర్‌కామ్‌ ద్వారా వీరిద్దరూ మాట్లాడుకున్నారు. వీరు మాట్లాడుకునే సమయంలో ఇద్దరు గార్డులు కూడా అక్కడ ఉన్నారు. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు వీరి సంభాషణ జరిగినట్లు జైలు సిబ్బంది వర్గాలు తెలిపాయి. ఆర్యన్‌ సరిగా తింటున్నావా? అని షారుక్‌ అడగ్గా.. జైలు భోజనం బాగోలేదని అతడు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆర్యన్‌ కోసం ఇంటి భోజనం పంపించొచ్చా? అని షారుక్‌ జైలు అధికారులను అడిగారట. అయితే, ఇందుకోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన తర్వాత ఆర్యన్ తన తండ్రిని నేరుగా చూడటం ఇదే తొలిసారి. అంతకుముందు ఒకసారి తల్లిదండ్రులతో వీడియో కాల్‌ మాట్లాడారు. ఆ సమయంలో ఆర్యన్‌ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్యన్‌ అరెస్టుతో షారుక్‌ కుటుంబం దిగులులో కూరుకుపోయింది. పండగ వేడుకలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆర్యన్‌ ఇంటికొచ్చేవరకు మన్నత్‌లో స్వీట్లు వండొద్దని ఇప్పటికే గౌరీఖాన్‌ తన సిబ్బందిని ఆదేశించారు. కొడుకు త్వరగా బయటకు రావాలని ఆమె పూజలు చేస్తున్నారు. 

కొడుకు అరెస్టు తర్వాత షారుక్‌ బయట కన్పించడం కూడా ఇదే తొలిసారి. మహారాష్ట్రలో కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో అక్కడి ప్రభుత్వం నిబంధనలను సడలించి.. జైల్లో ఉన్న వ్యక్తులు తమ వారిని కలుసుకొనేందుకు వీలు కల్పించింది. దీంతో షారుక్‌ నేడు జైలుకు వచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని