Shah Rukh Khan: కొత్త పార్లమెంట్‌పై షారుక్‌ ట్వీట్‌.. స్పందించిన ప్రధాని మోదీ..!

నూతన పార్లమెంట్‌పై చిత్రీకరించిన వీడియోకు బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ స్వరాన్ని అందించారు. ఆ వీడియోను ప్రధాని మోదీ రీట్వీట్‌ చేశారు.

Published : 28 May 2023 11:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పార్లమెంట్‌ నూతన భవనం(new Parliament) ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు సూపర్‌ స్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. వీరిలో బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan), సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth), అక్షయ్‌కుమార్‌(Rajinikanth) చేసిన ట్వీట్లకు ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా స్పందించారు. నిన్న ప్రధాని మోదీ పార్లమెంట్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. దీనిలో కేవలం నేపథ్యసంగీతం మాత్రమే ఉంది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ వీడియోకు వాయిస్‌ ఓవర్లను జోడించి ట్వీట్లు చేయాలని ప్రధాని కోరారు. వాటిల్లో కొన్నింటిని రీట్వీట్‌ చేస్తానని చెప్పారు. ఈ వీడియోలకు #myparliamentmypride  హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాలని సూచించారు.

దీనికి హోం మంత్రి అమిత్‌షా, మంత్రులు పీయూష్‌గోయల్‌, నిర్మలా సీతారామన్‌, హర్‌దీప్‌సింగ్‌ పూరి, కిరణ్‌ రిజుజు, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సహా పలువురు సెలబ్రిటీలు వీడియోలను పోస్టు చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ స్వరం అందించిన వీడియోను ప్రధాని మోదీ రీట్వీట్‌ చేశారు. ‘‘అద్భుతంగా వివరించారు. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రజాస్వామ్య బలానికి, ప్రగతికి ప్రతీక. సంప్రదాయ, ఆధునికతల మేళవింపు’’ అని పేర్కొన్నారు. ఈ వీడియలో ‘‘ కొత్త పార్లమెంట్‌ భవనం. మన ఆశల కొత్త ఇల్లు. 140 కోట్ల మందిని ఓ కుటుంబంగా ఉంచిన రాజ్యాంగాన్ని సమర్థించేవారి కొత్త ఇల్లు. గ్రామాలు, పట్టణాలు, దేశం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ఈ కొత్త పార్లమెంట్‌లో తగిన స్థానం ఉంటుంది. ఈ కొత్త ఇంటి బాహువులు ఎంత విశాలమైనవంటే దేశంలోని ప్రతి జాతిని, ధర్మాన్ని ప్రేమించేంతవి. దీని చూపులు ఎంత తీక్షణమైనవంటే.. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిని చూడగలవు. వారి సమస్యలను గుర్తించగలవు. ఇక్కడ సత్యమేవ జయతే అనే నినాదం స్లోగన్‌ కాదు.. విశ్వాసం..’’ అంటూ షారుక్‌ స్వరంతో సాగిపోయే ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకొంది. కొన్ని గంటల్లోనే దీనిని 57 లక్షల మంది వీక్షించారు.

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేసిన వీడియోను కూడా ప్రధాని రీట్వీట్‌ చేశారు. ‘‘కొత్త పార్లమెంట్‌ భవనం మన ప్రజాస్వామ్యానికి నిజంగా ఓ వెలుగు. ఇది దేశ సంపన్న వారసత్వాన్ని, భవిత కోసం ఉన్న బలమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది’’ అని ప్రధాని క్యాప్షన్‌ జోడించారు. ఇక ఈ వీడియలో వ్యాఖ్యానంలో తన అనుభవాలు వివరిస్తూ.. ‘‘నా తల్లిదండ్రులతో ఇండియాగేట్‌ను సందర్శించిన సమయంలో చుట్టుపక్కల చాలా వరకు బ్రిటిషర్లు నిర్మించిన భవనాలే కనిపించాయి. కానీ, బ్రాండ్‌ న్యూ, గ్రాండ్‌ న్యూ భవనాన్ని చూసి నా హృదయం గర్వంతో ఉప్పొంగింది. భారత పార్లమెంట్‌ ప్రజాస్వామ్య దేవాలయం. ఇది సరికొత్త భారత్‌ గుర్తు’’ అంటూ సాగింది.  తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమిళంలో చేసిన ట్వీట్‌కు.. ప్రధాని మోదీ కూడా తమిళంలోనే ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌ ఓం బిర్లా, రచయిత మనోజ్‌ శుక్లా, యూట్యూబర్ అజీత్‌ భారతీ, సినీనటుడు అనుపమ్‌ ఖేర్‌ వంటి వారి వీడియోలనూ ప్రధాని రీట్వీట్‌ చేశారు.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని