Pathaan: రాత్రి 2గంటలకు షారుక్‌ ఫోన్‌ చేశారు: సీఎం హిమంత

బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ రాత్రి 2గంటల సమయంలో తనకు ఫోన్‌ చేసి మాట్లాడారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Updated : 22 Jan 2023 16:51 IST

గువాహటి: బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌(Sharukh Khan) రాత్రి 2గంటల సమయంలో తనకు ఫోన్‌ చేసినట్టు అస్సాం(Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) తెలిపారు. పఠాన్‌(Pathaan) చిత్రానికి వ్యతిరేకంగా గువాహటిలో చెలరేగిన నిరసనలపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారని వెల్లడించారు. షారుక్‌-దీపికా పదుకొణె(Deepika Padukone) నటిచిన ‘పఠాన్‌’ను ప్రదర్శించొద్దంటూ చేపడుతున్న నిరసనలపై దర్యాప్తు చేస్తామని.. అలాంటి హింసాత్మక ఘటనల్ని పునరావృతం కానివ్వబోమని తాను హామీ ఇచ్చినట్టు సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే, నిన్న షారుక్‌ ఖాన్‌ ఎవరు? ఆయన గురించి, ఆయన సినిమాల గురించి తనకు తెలియదంటూ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

గువాహటిలో శుక్రవారం భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ‘పఠాన్‌’ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఆ సినిమా పోస్టర్లను చింపేసి నిప్పుపెట్టి నిరసన చేపట్టారు. ఈ పరిణామాలపై విలేకర్లు సీఎంను ప్రశ్నించగా.. ‘షారుక్‌ ఖాన్ ఎవరు? ఆయన గురించి నాకు తెలీదు. పఠాన్‌ చిత్రం గురించీ తెలీదు. ఈ సమస్యపై బాలీవుడ్ నుంచి అనేక మంది నాకు ఫోన్‌ చేశారు. ఖాన్ చేయలేదు. ఒకవేళ చేస్తే.. పరిశీలిస్తా. శాంతిభద్రతలను ఉల్లంఘించేవారిపై మాత్రం చర్యలు తీసుకుంటాం’ అంటూ మీడియా ప్రతినిధులతో నిన్న హిమంత వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున 2గంటలకు షారుక్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడారంటూ తాజాగా ట్వీట్‌ చేశారు. ‘‘బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ నాకు ఫోన్‌ చేశారు. రాత్రి 2గంటల సమయంలో నాతో మాట్లాడి గువాహటిలో జరిగిన ఘటనలపై ఆందోళన వ్యక్తంచేశారు. శాంతిభద్రతల్ని కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ఆయనకు చెప్పా. వీటిపై దర్యాప్తు చేసి.. అలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చా’’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. 

మరోవైపు, ‘పఠాన్‌’ చిత్రంలో బేషరమ్‌ పాటలో దీపికా పదుకొణె బికినీ దృశ్యాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వహిందూ పరిషత్‌తో పాటు పలువురు నేతలు ఆ చిత్రాన్ని నిషేధించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని