
ఆ హోటళ్లలో కస్టమర్లకు కరోనా బీమా!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు పర్యటక రంగం అత్యంత తీవ్రంగా నష్టపోయింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా జనాలు గుమ్మిగూడే ప్రాంతాలను మూసివేయడం, విమాన ప్రయాణాలను నిలిపివేయడంతో పర్యటక ప్రాంతాలు వెలవెలబోయాయి. పర్యటకులపై ఆధారపడిన అనేక హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల తిరిగి ఆ రంగం, పరిమితంగా విమానాల సేవలు పునరుద్ధరించడంతో కొన్ని దేశాల్లో హోటళ్లు కస్టమర్లకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. గదులు, పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ కస్టమర్లకు కరోనా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఈ విషయంలో సింగపూర్‌లో ఓ హోటల్ గ్రూపు మరో అడుగు ముందుకు వేసింది. కస్టమర్లకు ఏకంగా ‘కరోనా బీమా’ చేయిస్తోంది. కస్టమర్లకు కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖర్చులు బీమా ద్వారా తామే భరిస్తామని చెబుతోంది.
హాంకాంగ్‌కు చెందిన షాంగ్రి-లా గ్రూప్ ఆఫ్ హోటల్‌కు సింగపూర్‌లో నాలుగు చోట్ల హోటళ్లు ఉన్నాయి. మొన్నటి వరకు లాక్డౌన్ కారణంగా కస్టమర్లు లేక కళతప్పిన ఈ హోటళ్లు ఇప్పుడు పూర్తిస్థాయిలో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఎన్ని కరోనా జాగ్రత్తలు తీసుకున్నా కస్టమర్లు హోటళ్లలో బస చేయడానికి జంకుతుండటంతో షాంగ్రి-లా గ్రూపు ‘కరోనా బీమా’ను తీసుకొచ్చింది. ఈ హోటళ్లలో గదులు బుక్ చేసుకునే సమయంలోనే కస్టమర్‌కు 2,25,000 సింగపూర్ డాలర్ల(₹కోటి 37లక్షలు) ఆరోగ్య బీమా చేస్తుంది. దీనికి ప్రీమియం మొత్తం హోటల్ యాజమాన్యమే చెల్లిస్తుంది. ఈ బీమా కింద.. బస చేసే సమయంలో కస్టమర్‌కు కరోనా సోకితే క్వారంటైన్ అవడానికి ప్రత్యేక గదిని ఉచితంగానే కేటాయిస్తారు. క్వారంటైన్ వల్ల విమాన ప్రయాణం రద్దయితే.. మరో విమానం టికెట్‌ను కొనుగోలు చేసి ఇస్తారు. వైద్యానికి అయ్యే ఖర్చును కూడా హోటల్ యాజమాన్యమే బీమా ద్వారా చెల్లిస్తుంది.
ప్రస్తుతం ఈ కరోనా బీమా కేవలం విదేశీ పర్యటకులకు మాత్రమే వర్తిస్తుందని షాంగ్రి-లా గ్రూప్ వెల్లడించింది. జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీలోపు తమ హోటళ్లలో గదులు బుక్ చేసుకున్న వారికి బుకింగ్‌లోనే బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ‘‘కస్టమర్ల భద్రతే మా తొలి ప్రాధాన్యం. వారి కోసం మేం ఏమైనా చేస్తాం. ఇప్పటికే హోటళ్లలో కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తున్నాం. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకు వేసి.. కస్టమర్లలో హోటళ్లలో బసపై భయాలు పోగొట్టడం కోసం ఈ కరోనా బీమాను తీసుకొచ్చాం’’అని షాంగ్రి-లా రీజినల్ సీఈవో చాన్ కాంగ్ లియాంగ్ తెలిపారు.