Sharad Pawar: అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలకు ద్వారాలు తెరిచే ఉంటాయి - శరద్‌ పవార్‌

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహంలో ఉన్న అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలు.. తిరిగి శరద్‌ పవార్‌ గూటికి చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Published : 26 Jun 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అజిత్‌ పవార్‌ తిరుగుబాటుతో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) రెండుగా చీలిన సంగతి తెలిసిందే. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహంలో ఉన్న అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలు.. తిరిగి శరద్‌ పవార్‌ గూటికి చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సీనియర్‌ పవార్‌ స్పందిస్తూ.. అలా వచ్చే వారికి తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే, చేర్చుకునే ముందు తన సహచరులతో సంప్రదిస్తానని స్పష్టం చేశారు.

‘‘ఆ ఎమ్మెల్యేలు తిరిగి చేరడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడు చేరినా కార్యకర్తల్లో మనోధైర్యం పెంచుతుంది. కానీ, పార్టీ కార్యకర్తల భావోద్వేగాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నందున.. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని మాత్రం తిరిగి తీసుకోం. దీనిపై పార్టీ సహచరులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి సూర్యకాంత్‌ పాటిల్‌ తిరిగి పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్‌ పవార్‌ ఈ విధంగా స్పందించారు.

స్పీకర్‌ ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆ పదవికి ఎందుకంత ప్రాధాన్యం?

మహారాష్ట్రలో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్‌ పవార్‌ వర్గం ఎన్సీపీకి చెందిన 18 నుంచి 19 ఎమ్మెల్యేలు తిరిగి శరద్‌ పవార్‌ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ చేసిన శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎనిమిది చోట్ల విజయం సాధించింది. అజిత్‌ వర్గం మాత్రం నాలుగు చోట్ల పోటీ చేసి ఒకే స్థానానికి పరిమితం అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు