Sharad Pawar: రామమందిర నిర్మాణంతో అయోధ్యలో ఓట్లు వస్తాయనుకున్నారు..శరద్ పవార్

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని చాటి చెప్పారని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ అన్నారు.   

Published : 12 Jun 2024 12:35 IST

పుణె: లోక్‌సభ ఎన్నికల ద్వారా ప్రజలు రాజకీయాలను ఎలా సరిదిద్దగలరో చూపించారని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్ పవార్(Sharad Pawar) అన్నారు. భాజపా అభ్యర్థిని ఓడించడం ద్వారా అయోధ్య(Ayodhya) ప్రజలు మతపరమైన రాజకీయాలను ప్రోత్సహించమని చెప్పకనే చెప్పారన్నారు. ప్రజలు రాజకీయాలను, మత విశ్వాసాలను కలిపి చూడరని ముందే ఊహించానన్నారు.

బారామతిలో జరిగిన ఓ సమావేశంలో పవార్ మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో 300 కంటే ఎక్కువ సీట్లు సాధించిన భాజపా(BJP) ఈసారి 240సీట్లతో సరిపెట్టుకుందన్నారు. ‘‘భాజపా రామమందిరాన్ని ఎన్నికల ఎజెండాగా ఉపయోగించుకోవాలని అనుకుంది. కానీ మన దేశ ప్రజలు చాలా తెలివైనవారు. ఆలయం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని గ్రహించారు. అందుకే కాషాయ పార్టీకి 60 సీట్లు తగ్గాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్‌ కీలక పాత్ర పోషించింది. ఇక్కడి ప్రజలు వారు అనుకున్న దానికంటే భిన్నమైన తీర్పును ఇచ్చారు. ఒక విధంగా చూస్తే భాజపా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని శరద్‌ పవార్‌ అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం చెక్కుచెదరకుండా ఉందని దానిని అంతం చేయడం రాజకీయాల వల్ల సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

గత 10ఏళ్లుగా అధికారంలో ఉన్నవారు వారికి నచ్చిన విధంగా మార్పులు చేర్పులు చేశారని అందువల్లే ప్రజలు వారిని తిరిగి నేలమీదకు తెచ్చారని విమర్శించారు. ఇప్పుడు మోదీ(PM Modi) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది సొంతంగా సాధించిన మెజారిటీతో కాదన్నారు. చంద్రబాబు నాయుడు (టీడీపీ), నితీష్‌ కుమార్ (జేడీయూ) సహాయం తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు.  ఇతరుల సహాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అందరి ఆలోచనలకు అనుగుణంగా పాలన చేపట్టాలని, ఇక మోదీ సొంత నిర్ణయాలు తీపుకోవడానికి ఆస్కారం ఉండదని పవార్‌ పేర్కొన్నారు. 

అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ (Awadhesh Prasad) ఇటీవలి ఎన్నికల్లో సిట్టింగ్ భాజపా ఎంపీ లల్లూ సింగ్‌(Lallu Singh) పై 54,567 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని