Jagdeep Dhankhar: ఆయన వ్యాఖ్యలతో నా హృదయం బరువెక్కింది: జగదీప్‌ ధన్‌ఖడ్‌

నూతన నేర చట్టాలను రూపొందించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 06 Jul 2024 20:50 IST

దిల్లీ: బ్రిటిష్‌ వలస పాలన నాటి నేర న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేస్తూ రూపొందించిన మూడు నేర చట్టాల (Criminal Laws)పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం (P. Chidambaram) చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపత్రి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) మండిపడ్డారు. పార్లమెంట్‌ విజ్ఞతను అవమానించేలా ఆయన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్ట్ టైమర్లు ఈ మూడు కొత్త చట్టాలను రూపొందించారని.. ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పి. చిదంబరం వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ధన్‌ఖడ్‌ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ఈ రోజు ఉదయం దినపత్రికలో వచ్చిన ఓ వ్యాసం చూసి నా హృదయం ఎంతో బరువెక్కింది. కొత్త నేర చట్టాలను పార్ట్‌ టైమర్లు రూపొందించారని కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యానించారు. ఆయన గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఎంతో ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు.

ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!

అందుకు గర్విస్తున్నా..

‘‘ పార్లమెంట్‌ సభ్యులను అవమానించేలా, వారి పరువుకి నష్టం కలిగించేలా మాట్లాడకండి. దయచేసి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అభ్యర్థనను కాంగ్రెస్‌ నేత పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. తిరువనంతపురంలోని స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వలసవాద తత్వం నుంచి బయటపడేసిన ఈ నూతన చట్టాలను పార్లమెంట్ ఆమోదించినందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని