Politics: శశిథరూర్‌ సెల్ఫీ విత్‌ భగవంత్‌ మాన్‌..!

పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై భారీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్‌ మాన్‌కు శుభాకాంక్షలు తెలిపిన శశిథరూర్‌.. తమది పార్లమెంటరీ సాంగత్యమంటూ గుర్తు చేసుకున్నారు.

Published : 15 Mar 2022 01:47 IST

పార్లమెంటరీ సాంగత్యమంటూ ట్వీట్‌ చేసిన కాంగ్రెస్‌ నేత

దిల్లీ: వారిద్దరూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు. ఇటీవల పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో జాతీయ పార్టీని మట్టికరిపించి సీఎం అయ్యేందుకు సిద్ధమైన భగవంత్‌ మాన్‌ ఒకరైతే.. జాతీయ పార్టీకి చెందిన మరొక సీనియర్‌ నేత శశిథరూర్‌. పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఇద్దరు నేతలు తాజాగా ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకోవడమే కాకుండా సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై భారీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్‌ మాన్‌కు శుభాకాంక్షలు తెలిపిన శశిథరూర్‌.. తమది పార్లమెంటరీ సాంగత్యమంటూ గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ ఫొటోను శశిథరూర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

‘పార్లమెంటరీ సాంగత్యము: పంజాబ్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్‌ మాన్‌కు చాలా మంది కాంగ్రెస్‌ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభలో ఒకే బెంచ్‌పై ఐదేళ్లపాటు తనతో కూర్చున్న భగవంత్‌ ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉంది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ పేర్కొన్నారు. ఇక పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ చేతిలో ఘోర పరాజయం పొందిన తర్వాత.. భగవంత్‌ మాన్‌కు కాంగ్రెస్‌ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపిన తొలి వ్యక్తి కూడా శశిథరూర్‌ కావడం విశేషం.

ప్రస్తుతం సంగ్రూర్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భగవంత్‌ మాన్‌ మార్చి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, పార్లమెంట్‌ సమావేశాలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో సభకు హాజరైన మాన్‌కు పలువురు ఎంపీలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భగవంత్‌ మాన్‌తో సెల్ఫీ తీసుకున్న కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌.. ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఇదిలాఉంటే, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమ్‌ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ 92 స్థానాల్లో ఆప్‌ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు ఎన్నికల్లో 77స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌.. ఈసారి 18 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని