Viral news: ఫోన్‌ మోగుతుంటే..?

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ 1919నాటి ఓ కార్టూన్‌ను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఒక వ్యక్తి జీవితంలో ఫోన్‌ మోగిన వివిధ సందర్భాలను అది వర్ణిస్తుంది. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Published : 20 Nov 2022 01:49 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆయన 1919 నాటి ఓ కార్టూన్‌ను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఫోన్‌ మోగిన వివిధ సందర్భాలను వర్ణిస్తుంది. రైలు కోసం కంగారుగా పరుగెడుతున్నప్పుడు, చేతినిండా సామాన్లు ఉన్నప్పుడు, వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, చుట్టూ జనాలతో రణగొణ ధ్వనుల్లో ఉన్నప్పుడు, చంటిపిల్లాడిని వేరొకరి చేతికి అందిస్తున్నప్పడు, పెళ్లి చేసుకుంటున్నప్పుడు తదితర సందర్భాల్లో ఫోన్‌ మోగితే ఎలా ఉంటుందో ఆ కార్టూన్‌ చెబుతోంది.

ప్రస్తుతం సెల్‌ఫోన్‌ మన జీవితంలో భాగమైపోయింది. చివరికి పడకగదిలో కూడా పక్కనే పెట్టుకొని పడుకునే వారెందరో. దీనివల్ల సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నా పెడచెవిన పెట్టేస్తున్నారు. అలాంటిది అప్పుడప్పుడే వినియోగంలోకి వస్తున్న మొబైల్‌ ఫోన్‌ వల్ల కలిగే ఇబ్బందిని ఊహించి వేసిన ఈ కార్టూన్‌ అందర్నీ ఆకర్షిస్తోంది. ‘‘ సాంకేతికత గురించి కొన్నిసార్లు అంచనాలు వింతగా ఉంటాయి. 1919 నాటి ఈ కార్టూన్‌ని చూడండి. అప్పట్లో ఫిక్స్‌డ్‌ లైన్‌ టెలిఫోన్లు (ల్యాండ్‌ లైన్‌ ఫోన్లు) ఎక్కువగా ఉండేవి. కానీ, ఇది మొబైల్‌ ఫోన్‌.. 80 సంవత్సరాల తర్వాత దానివల్ల వచ్చే ఇబ్బందిని అప్పట్లోనే ఊహించి వేసిన కార్టూన్‌ ఇది’’ అంటూ శశిథరూర్‌ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని