Shashi Tharoor: నిర్మలాజీ.. మీరు గ్రేట్.. ఆ పాప కోసం రూ. ఏడు లక్షలు వదిలేశారు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. ఆ ట్విటర్ వేదికగా ఆ సంఘటన తాలూకు వివరాలు వెల్లడించారు. 

Published : 30 Mar 2023 13:20 IST

దిల్లీ: కాంగ్రెస్ (congress) ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) ట్విటర్ వేదికగా ఒక గుడ్‌న్యూస్‌ను పంచుకున్నారు. అలాగే ఆ మంచికి కారణమైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman)కు కృతజ్ఞతలు తెలియజేశారు. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఒక చిన్నారికి మంత్రి అందించిన తోడ్పాటే థరూర్ స్పందనకు కారణమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

‘కొద్దిరోజుల క్రితం నావద్దకు ఒక యువజంట వచ్చింది. వారి కుమార్తె నిహారిక అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె చికిత్సకు వాడే ఒక ఇంజెక్షన్ ఖరీదు రూ. 65 లక్షలు. ఆ మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్, దాతల సహాయంతో ఎలాగోలా సమకూర్చుకున్నారు. అయితే దిగుమతి చేసుకున్న ఆ ఇంజెక్షన్‌కు అదనంగా రూ. ఏడులక్షల జీఎస్టీ పడుతుందని చెప్పారు. అంతమొత్తాన్ని తాము భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ నా సహాయం కోరారు. ఈ విషయంపై నేను వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)కు లేఖ రాశాను. మానవతా సాయం కింద మినహాయింపు ఇవ్వాలని అందులో కోరాను’ అని థరూర్‌ తెలిపారు.

‘అయితే నాకు మంత్రి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఆమెకు ఫోన్‌  చేసి, ఆ ఔషధం కస్టమ్స్‌ కస్టడీ నుంచి త్వరగా విడిపించాల్సిన ఆవశ్యకతను, ఆలస్యమైతే ఆ మందు పాడవుతుందని చెప్పాలని  నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో మరోసారి ఆ లేఖను పంపగా.. అరగంటలో సమాధానం వచ్చింది. ఆమె సెక్రటరీ నాకు ఫోన్ చేశారు. మంత్రి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్‌తో మాట్లాడారని చెప్పారు. ఆ వెంటనే మార్చి 28 రాత్రి ఏడుగంటలకు వారికి జీఎస్టీ మినహాయింపు లభించింది. ఈ చర్యతో ప్రజలకు ప్రభుత్వం, రాజకీయాలు, మానవత్వంపై ఉన్న నమ్మకాన్ని నిలిపిఉంచారు’ అంటూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక చిన్నారి మోములో చిరునవ్వు  కోసం  కేంద్ర ఆర్థిక శాఖ రూ. ఏడులక్షలు వదులుకుందని చెప్పారు. అలాగే  గుడ్‌న్యూస్ స్టోరీ అంటూ ఈ మొత్తం వివరాలను వెల్లడించారు. ‘నేను రాజకీయంగా ముందుకు సాగాలా..? వద్దా..? అనుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను వెల్లడిచేస్తుంటాయి’ అని థరూర్ (Shashi Tharoor) సంతోషం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని