IRCTC: కప్‌ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్‌.. ట్వీట్‌ వైరల్‌!

వినోద్‌ వర్మ అనే ప్రయాణికుడు దిల్లీ- బోపాల్‌ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జూన్‌ 28న ప్రయాణించాడు. కప్‌ టీ కొన్నందుకు గానూ అతడు రూ.70 చెల్లించాడు.

Published : 03 Jul 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ కప్పు టీ ఎంతుంటుంది? మహా అయితే ఓ పదీ పదిహేను రూపాయలు. రైళ్లలో కూడా దాదాపు అంతే. కానీ ఓ రైలు ప్రయాణికుడు మాత్రం కప్పు టీ కోసం ఏకంగా రూ.70 వెచ్చించాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇందులో కప్‌ టీ ధర రూ.20 మాత్రమే. దీనికి సర్వీస్‌ ఛార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చింది. దీంతో తీరా టీ తీసుకుని బిల్లు అందుకున్న ప్రయాణికుడు కంగుతిన్నాడు. అతడు చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వినోద్‌ వర్మ అనే ప్రయాణికుడు దిల్లీ- బోపాల్‌ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జూన్‌ 28న ప్రయాణించాడు. కప్‌ టీ కొన్నందుకు గానూ అతడు రూ.70 చెల్లించాడు. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీ ఇచ్చిన ఇన్‌వాయిస్‌ను ట్విటర్‌లో పెడుతూ ‘రూ.20 టీకి రూ.50 సర్వీస్‌ ఛార్జీ.. మరీ ఇంత దోపిడీయా?’ అంటూ ట్వీటాడు. దీంతో ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు సైతం ‘టూ మచ్‌’ అంటూ కామెంట్‌ చేశారు. మరికొందరు ‘ఆ టీకి 5 రూపాయలే ఎక్కువ’ అంటూ కామెంట్లు పెట్టారు. సర్వీస్‌ ఛార్జీ వసూలు చేయకూడదంటూ రెస్టారెంట్లకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన వార్తల క్లిప్పింగులను మరికొందరు పోస్ట్‌ చేశారు.

అయితే, రైల్వే అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. ప్రయాణికుడి నుంచి అదనంగా ఎలాంటి మొత్తమూ వసూలు చేయలేదని పేర్కొన్నారు. దీనికి 2018లో జారీ చేసిన ఓ సర్క్యులర్‌ను ఉదాహరణగా చూపారు. రాజధాని లేదా శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్‌ చేయకుండా.. ప్రయాణ సమయంలో బుక్‌ చేస్తే రూ.50 సర్వీస్‌ ఛార్జి చెల్లించాల్సి ఉంటుందన్నది ఆ సర్క్యులర్‌ సారాంశం. అది టీ అయినా, కాఫీ అయినా.. అని అందులో పేర్కొన్నారు. అయితే, తొలుత ఈ రైళ్లలో ఫుడ్‌ డెలివరీకి సంబంధించి సర్వీసు ఛార్జీ అనేది టికెట్‌ ఛార్జీతో పాటే ఉండేది. తర్వాత దీన్ని ప్రయాణికుల ఐచ్ఛికానికి వదిలేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని